వైద్య ఆరోగ్యరంగంలో ఏపీకి మరో రెండు అవార్డులు
Two more awards for AP in the field of medicine and health. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనల ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లో వైద్య రంగంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా
By Medi Samrat Published on 10 Dec 2022 8:15 PM ISTముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనల ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లో వైద్య రంగంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా, భవిష్యత్తులోనూ సాధ్యం కాదనేలా విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలో యూనివర్సల్ హెల్త్ కవరేజి డే వేడుకలను శనివారం ప్రారంభించారు. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రితోపాటు దేశంలోని ఆయా రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ మంత్రులంతా హాజరయ్యారు. ఈ వేడుకల్లో భాగంగా మూడు అంశాల్లో రాష్ట్రాలకు కేంద్రం అవార్డులు ప్రకటించగా.. ఏకంగా రెండు అంశాల్లో ఏపీ బహుమతులు గెలుచుకుంది. కేంద్రవైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ మన్సూక్ మాండవీయ చేతుల మీదుగా టెలీకన్సల్టేషన్ విభాగంలో ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు అవార్డు అందుకున్నారు. విలేజ్ హెల్త్ క్లినిక్‌ల అంశానికి ఆదివారం మరో అవార్డు ఏపీ ప్రభుత్వం అందుకోనుంది.
ఈ వేడుకల్లో భాగంగా మంత్రి విడదల రజిని మంత్రుల చర్చాగోష్టిలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ - 15 వ ఆర్థిక సంఘం నిధులు అనే అంశంపై మంత్రుల చర్చాగోష్టి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. ఏపీలో వైద్య ఆరోగ్యరంగంలో అమలుచేస్తున్న సంస్కరణలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తున్నదని చెప్పారు. తాజాగా వారణాసిలో కేంద్రప్రభుత్వం నిర్వహించిన యూనివర్సల్ హెల్త్ కవరేజి డే వేడుకుల్లోనూ రెండు విభాగాల్లో అవార్డులు దక్కడం గర్వకారణమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కేవలం మూడు విభాగాల్లోనే అవార్డులు ప్రకటించగా.. ఏకంగా రెండు విభాగాల్లో ఏపీకి బహుమతులు దక్కడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్తశుద్ధికి నిదర్శనమని చెప్పారు. ఏపీ ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎంతో కృషి చేస్తున్నదని, కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాలు కూడా ఏపీని ఎంతో మెచ్చుకుంటున్నాయని వివరించారు. ఏపీలో మెడికల్ కళాశాలల నిర్మాణం, క్యాన్సర్, కిడ్నీ వ్యాధి కి చికిత్స అందించే విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ కూడా ఉండాలని ఆకాంక్షించారు.