తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కీలక ప్రకటన చేశారు. జమ్మూకశ్మీర్‌లో త్వరలోనే వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించబోతున్నట్టు తెలిపారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా 500 ఆలయాలను నిర్మించనున్నట్టు తెలిపారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా గిరిజన, దళిత, బలహీన వర్గాలు, మత్స్యకార గ్రామాల్లోని కాలనీల్లో వీటిని నిర్మించనున్నట్టు చెప్పుకొచ్చారు.

గుడికో గోమాత కార్యక్రమంలో భాగంగా ఢిల్లీలోని టీటీడీ ఆలయానికి గోవును అందించారు. టీటీడీ తరపున దేశవ్యాప్తంగా ఆలయాలకు గోవులను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కూడా చెప్పారు. ముంబైలో ఆలయ నిర్మాణానికి ఇప్పటికే ఏర్పాట్లు చేశామని, అయోధ్యలో ఆలయం, లేదంటే కల్యాణ మంటపం, లేదంటే సత్రం నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నట్టు వైవీ తెలిపారు. ఢిల్లీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాజధానిలో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర కాలేజీని యూనివర్సిటీగా అభివృద్ధి చేసేందుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపనున్నట్టు సుబ్బారెడ్డి చెప్పారు.

జనవరి 4 నుంచి 31 వరకూ రూ.300 ధరపై ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈ ఉదయం విడుదల చేశారు. రోజుకు 20 వేల చొప్పున టికెట్లను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచామని, ఒక్కో యూజర్ ఐడీపై ఆరు వరకూ టికెట్లను కొనుగోలు చేయవచ్చని అధికారులు తెలిపారు.

టీటీడీ కొత్త క్యాలెండర్లు, డైరీలకు తీవ్ర కొరత ఏర్పడింది. 2021 సంవత్సరానికి సంబంధించిన పెద్ద డైరీలు, 12 పేజీల క్యాలెండర్ల స్టాక్స్ లేవని చెబుతున్నారు. వైకుంఠ దర్శనాలకు వచ్చిన భక్తుల్లో అత్యధికులు ఈ క్యాలెండర్లు, డైరీల కోసం పుస్తక విక్రయశాలల వద్ద బారులు తీరుతున్నారు. చిన్న డైరీలు, చిన్న క్యాలెండర్లు, పంచాంగాలు, టేబుల్ క్యాలెండర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయట.


సామ్రాట్

Next Story