కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు వచ్చిన సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల వెళ్తుంటారు. దీంతో ప్రతీ వేసవికాలం సెలవుల్లో రెండు నెలలు తిరుమలలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.
వీఐపీ బ్రేక్ దర్శనాల సమయంలో మార్పులు చేసినట్టు టీటీడీ ప్రకటించింది. వేసవిలో పెరగనున్న భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకొని ఈ మార్పులు చేస్తున్నట్టు బోర్డు తెలిపింది. మే 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉదయం 6 గంటల నుంచి ప్రారంభం అవుతాయని పేర్కొంది. భక్తుల రద్దీ అధికంగా ఉండనుండటంతో కేవలం ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే ఈ దర్శనాలు ఉంటాయని స్పస్టం చేసింది. ఈ ఉత్తర్వులు మే 1 నుంచి జులై 15 వరకు అమలులో ఉంటాయని టీటీడీ తెలియ జేసింది.