తిరుమలలోని శ్రీవారి ఆలయ ప్రాంగణం, చుట్టుపక్కల అసభ్యకరమైన సోషల్ మీడియా రీల్స్ క్రియేట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ వార్నింగ్ ఇచ్చింది. ఆలయ పవిత్రతను, భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇటీవల కొందరు ఆలయం వద్ద, పరిసర ప్రాంతాల్లో రీల్స్ చిత్రీకరిస్తున్నారని టీటీడీ దృష్టికి వచ్చింది. టీటీడీ అధికారులు ఈ చర్యలను తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో ఇలాంటి చర్యలు భక్తి వాతావరణానికి విఘాతం కలిగిస్తాయని, భక్తులకు అసౌకర్యం కలిగిస్తాయని వారు పేర్కొన్నారు. ఎవరైనా శ్రీవారి ఆలయం లేదా ఇతర టీటీడీ ఆలయాల వద్ద రీల్స్, వెకిలి చేష్టలతో వీడియోలు వీడియోలు, షార్ట్స్ చిత్రీకరించినట్లు తేలితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని టీటీడీ స్పష్టం చేసింది. భక్తులంతా ఆలయ నియమాలను పాటించి, ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
తిరుమల కేవలం పూజ, భక్తి కోసం మాత్రమే. ఇలాంటి చర్యలు తిరుమల పవిత్రతకు భంగం కలిగించడమే కాకుండా, శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం పవిత్ర పుణ్యక్షేత్రాన్ని సందర్శించే లక్షలాది మంది భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తాయని టీటీడీ పేర్కొంది. "తిరుమల అనేది కేవలం పూజ మరియు భక్తి కోసం ఉద్దేశించబడిన పవిత్ర స్థలం. ప్రతి భక్తుడు దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను సమర్థించి గౌరవించాలని భావిస్తున్నారు" అని టీటీడీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.