శ్రీవారి భక్తులకు అలర్ట్..జూలై నెల దర్శన టికెట్ల కోటా విడుదల, పూర్తి షెడ్యూల్ ఇదే!
తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక సమాచారం అందించింది
By - Knakam Karthik |
శ్రీవారి భక్తులకు అలర్ట్..జూలై నెల దర్శన టికెట్ల కోటా విడుదల, పూర్తి షెడ్యూల్ ఇదే!
తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక సమాచారం అందించింది. జూలై నెలకు సంబంధించిన వివిధ దర్శన టోకెన్లు, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్‌ను ప్రకటించింది. జూలైలో స్వామివారిని దర్శించుకోవాలని ప్లాన్ చేసుకునే భక్తులు ముందుగానే ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
షెడ్యూల్ ప్రకారం, ఏప్రిల్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆర్జిత సేవా టికెట్ల లక్కీ డిప్ కోసం భక్తులు అధికారిక వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి. వీరికి ఏప్రిల్ 20 నుంచి 22 మధ్య టికెట్లు కేటాయిస్తారు. ఇక ఏప్రిల్ 21న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ వంటి ఆర్జిత సేవా టికెట్లను ఉదయం 10 గంటలకు, వర్చువల్ సేవలకు సంబంధించిన కోటాను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. ఏప్రిల్ 23న భక్తుల రద్దీని బట్టి అంగప్రదక్షిణ టోకెన్లు (ఉదయం 10), శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు (ఉదయం 11), వయోవృద్ధులు మరియు దివ్యాంగుల కోటాను (మధ్యాహ్నం 3) అందుబాటులో ఉంచుతారు.
అత్యధికంగా భక్తులు వేచి చూసే రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని వసతి గదుల కోటాను కూడా ఆన్‌లైన్‌లో ఉంచుతారు. భక్తులు కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని, నకిలీ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.