కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని సింహాద్రిపురం మండలం దిద్దేకుంట గ్రామంలో రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. అప్పుల బాధతో భార్య, ఇద్దరు పిల్లలతో రైతు నాగేంద్ర ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను భర్త నాగేంద్ర, భార్య వాణి, కుమారుడు భార్గవ్, కుమార్తె గాయత్రిగా గుర్తించారు. గత కొంతకాలంగా నాగేంద్ర సొంత పొలంతో పాటు కొంత భూమి కౌలుకుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అప్పులవగా.. అవి తీర్చలేక సొంత పొలంలోనే బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వ్యవసాయ మంత్రి దిగ్భ్రాంతి..
కడప జిల్లాలో రైతు కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబంతో సహా రైతు ఆత్మహత్య చేసుకున్న వార్తపై విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. రైతు కుటుంబం మృతికి గల కారణాలు తెలియచేయాలని అధికారులను ఆదేశించారు.