రేపు ఏపీ కేబినెట్ భేటీ, వీటికే ఆమోదం తెలిపేది..
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది.
By Knakam Karthik Published on 16 March 2025 5:07 PM IST
రేపు ఏపీ కేబినెట్ భేటీ, వీటికే ఆమోదం తెలిపేది..
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది. ఇందులో రాజధాని అమరావతి పనులకు ఆమోదం తెలపనున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీలో ఆమోదించిన రూ.32,702 కోట్ల విలువైన పనులు చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ ఆమోదంతో టెండర్లు దక్కించుకున్న సంస్థలకు సీఆర్డీఏ లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లు జారీ చేయనుంది. రాష్ట్ర పెట్టబడులు ప్రోత్సాహక బోర్డు నాలుగవ సమావేశంలో 10 సంస్థలు రాష్ట్రంలో పెట్టనున్న రూ.1,21,659 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. వీటి ద్వారా 80 వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన 10 సంస్థల సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. రేపటి కేబినెట్ భేటీలో ఆ పది సంస్థలు రాష్ట్రంలో పెట్టనున్న రూ.1,21,659 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనున్నారు. ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ నెల్లూరు జిల్లా నాయుడుపేటలో రూ.1,742 కోట్ల పెట్టుబడులకు, దాల్మియా సిమెంట్ సంస్థ కడప జిల్లాలో రూ.2,883 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. లులూ గ్లోబలర్ ఇంటర్నేషనల్ సంస్థ విశాఖలో రూ.1,500 కోట్ల పెట్టుబడులతో నిర్మించే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు కూడా మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. సత్యవీడు రిజర్వ్ ఇన్ఫ్రా సిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ శ్రీ సిటీలో పెట్టనున్న రూ.25 వేల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.