దేశ వ్యాప్తంగా టమాటా ధరలు రికార్డు స్థాయిలో పలుకుతున్నాయి. కిలో టమాటాలకు రూ.100పైగా పలుకుతోంది. అయితే చిత్తూరు జిల్లాలోని మాత్రం టమాటా ధర ఒక్కసారిగా పడిపోయింది. ములకల చెరువు వ్యవసాయ మార్కెట్ యార్డులో కిలో టమాటా రూ.20 పలికింది. 30 కిలోల టమాట పెట్టె రూ.600కు అమ్ముడుపోయింది. రెండు రోజుల కిందట ఇదే మార్కెట్‌లో 30 కిలోల టమాటా పెట్టె రూ.3 వేల రికార్డు ధర పలికింది. అయితే తాజాగా పక్క రాష్ట్రాల నుండి పలువురు కూరగాయల వ్యాపారులు టమాటా స్టాక్‌ను పెద్ద ఎత్తున తీసుకురావడంతో భారీగా ధర తగ్గింది.
ఇక ఇదే చిత్తూరు జిల్లాలోని టమాటా మార్కెట్‌కు ప్రసిద్ధి పొందిన మదనపల్లి మార్కెట్‌లో టమాటా ధర పతనమైంది. ఫస్ట్ క్లాస్ టమాటా రేటు కిలో రూ.50 పలికింది. శనివారం, ఆదివారం నాడు మదనపల్లి మార్కెట్‌కు చెన్నై వ్యాపారులు రారన్న నేపథ్యంలో ధర పడిపోయిందని వాదన ఉంది. అయితే మరో రెండు రోజుల్లో టమాట ధరలు మళ్లీ రికార్డు స్థాయిలో పలుకుతాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. మూడు రోజుల కిందట మదనపల్లిలో టమాటా ధర కిలో రూ.140 పలికింది. అలాగే కర్నూలు జిల్లాలోని పత్తికొండ, ఎమ్మిగనూరు, ప్యాపిలి కూరగాయల మార్కెట్లలో కూడా టమాట ధరలు తగ్గింది. కిలో టమాటా రూ.30 నుంచి రూ.40కు అమ్ముడుపోతోంది.