తిరుపతి తొక్కిసలాట ఘటన ప్రమాదమా.. ఏదైనా కుట్ర కోణమా అనే అంశం విచారణలో తేలుతుందని హోంమంత్రి అనిత చెప్పారు. రుయా ఆస్పత్రిలో క్షతగాత్రులను మంత్రులు అనగాని సత్యప్రసాద్, ఆనం రాంనారాయణతో కలిసి ఆమె పరామర్శించారు. ఘటన వివరాలను మంత్రులకు ఎస్పీ, కలెక్టర్ వివరించారు. బాధ్యులు ఏ స్థాయిలో ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని అనిత స్పష్టం చేశారు. వైఫల్యం ఎవరిదో సీసీ కెమెరాల్లో తెలుస్తుందని పేర్కొన్నారు.
తిరుపతి తొక్కిసలాట ఘటనపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. బైరాగిపెట్టెడ వద్ద తొక్కిసలాటపై ఈస్ట్ పోలీస్‌స్టేషన్‌లో నారాయణపురం ఎంఆర్‌వో, విష్ణు నివాసంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై బాలయ్యపల్లె ఎంఆర్‌వో ఫిర్యాదు చేశారు. నిన్న రాత్రి టోకెన్లు జారీ చేసే క్రమంలో పెద్ద ఎత్తున భక్తులు రావడంతో మూడు చోట్ల తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, 40 మందికిపైగా గాయపడ్డారు.