ఫిర్యాదు చేయడానికి పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే.. కనీసం తీసుకోడానికి కూడా పోలీసులు ఆసక్తి చూపలేదని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జుగుప్సాకర పోస్టుల్ని సోషల్ మీడియాలో పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి నేతృత్వంలో ఈస్ట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
అనంతరం తిరుపతి ఎంపీ మీడియాతో మాట్లాడుతూ.. మహేశ్ అనే వ్యక్తి ద్వారా తమ నాయకులపై అసభ్య పోస్టుల గురించి తెలుసుకున్నామన్నారు. ఆ పోస్టులు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు ఫిర్యాదు చేయడానికి పోలీసుస్టేషన్‌కు వెళ్తే దాదాపు 40 నిమిషాల సమయం అసలు పట్టించుకోలేదన్నారు. ఫిర్యాదుపై రిసిప్ట్ ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. కూటమి ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థని శాంతిభద్రతల్ని కాపాడటానికి కాకుండా.. ప్రత్యర్థుల్ని వేధించడానికి వాడుకుంటున్నారని ఆరోపించారు.
ప్రొటోకాల్‌ని పాటించని పోలీసులపై ప్రివిలేజ్‌మోషన్ మూవ్ చేయాల్సి వుంటుందని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆయన హితవు పలికారు. లేదంటే తగిన మూల్యం చెల్లించాల్సి వుంటుందని పోలీసుల్ని ఆయన హెచ్చరించారు.