తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఎదురుచూస్తున్న భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనాలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి కోటా టికెట్లను ఇవాళ ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. కాగా తొలిమూడు రోజులకు ఇప్పటికే ఈ-డిప్ ద్వారా టికెట్లు కేటాయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు దర్శనాలకు ఉదయం 10 గంటలకు రోజుకు వెయ్యి చొప్పున శ్రీవాణి టికెట్లు రిలీజ్ చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు రోజుకు 15 వేల చొప్పున రూ.300 టికెట్లు విడుదల చేయనున్నారు.
కాగా ఈ ఏడాది డిసెంబర్ 30 నుంచి వచ్చే ఏడాది జనవరి 8 వరకు పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనుంది. అలాగే శ్రీవాణి ట్రస్ట్ దాతలకు దర్శనం, వసతి గదుల కోటాను అదే రోజు ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. భక్తులు తమ టికెట్లను టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా బుక్ చేసుకోవచ్చు.