ఇవాళ ఏపీలో కీలక ఘట్టం..ఒకేసారి ౩ లక్షల గృహప్రవేశాలు
రాష్ట్రంలో పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ కూటమి ప్రభుత్వం కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టింది
By - Knakam Karthik |
ఇవాళ ఏపీలో కీలక ఘట్టం..ఒకేసారి ౩ లక్షల గృహప్రవేశాలు
అమరావతి: రాష్ట్రంలో పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ కూటమి ప్రభుత్వం కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు, అధికారంలోకి వచ్చిన 17 నెలల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఈ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులు బుధవారం సామూహిక గృహ ప్రవేశాలు చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు అన్నమయ్య జిల్లా నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై)లోని వివిధ విభాగాల కింద ఈ ఇళ్ల నిర్మాణం జరిగింది. పీఎంఏవై-అర్బన్ కింద 2,28,034, పీఎంఏవై-గ్రామీణ్ కింద 65,292, పీఎంఏవై-జన్‌మన్ పథకం కింద 6,866 ఇళ్లను నిర్మించారు. మొత్తం 3,00,192 ఇళ్లలో లబ్ధిదారులు ఒకేరోజు గృహ ప్రవేశాలు చేసేందుకు గృహ నిర్మాణ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆయా జిల్లాల్లో మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ వేడుకల్లో పాల్గొంటారు.
అన్నమయ్య జిల్లాలో సీఎం పర్యటన
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు సీఎం చంద్రబాబు ఈరోజు అన్నమయ్య జిల్లాకు వెళ్లనున్నారు. రాయచోటి మండలం దేవగుడిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అక్కడ లబ్ధిదారులతో కలిసి సామూహిక గృహ ప్రవేశాలు చేసి, వారికి ఇంటి తాళాలను స్వయంగా అందిస్తారు. అనంతరం అక్కడి నుంచే రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో పూర్తయిన ఇళ్లను వర్చువల్‌గా ప్రారంభిస్తారు. పర్యటనలో భాగంగా ప్రజావేదిక సభలో ప్రసంగించడంతో పాటు, పార్టీ ముఖ్య కార్యకర్తలతో సీఎం సమావేశం కానున్నారు.