20 లక్షల ఉద్యోగాల కల్పనకు ఇది ముందడుగు : నారా లోకేష్
రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థతో జరిగిన నేటి ఒప్పందం 20 లక్షల ఉద్యోగాల కల్పనకు ఇది ముందడుగని మంత్రి నారా లోకేష్ అన్నారు
By Medi Samrat Published on 12 Nov 2024 8:00 PM ISTపెట్టుబడుల సాధనలో ఏపీ జోరు మీద ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన పారిశ్రామిక పాలసీలు సత్ఫలితాలను ఇస్తున్నాయని సీఎం అభిప్రాయ పడ్డారు. ఏపీలో రూ.65 వేల కోట్లతో కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒప్పందం చేసుకుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఈ ఎంవోయూ జరిగింది. ఈ ఒప్పందం ద్వారా 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ద్వారా రాష్ట్రానికి రూ.57,650 కోట్ల ఆదాయంతో పాటు 2.5 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. నేటి ఒప్పందం గొప్ప ముందడుగు అన్నారు. పెట్టుబడులకు రాష్ట్రంలో అనుకూల పరిస్థితులు ఉన్నాయని..స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు ఎపి కేంద్రంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ఇలాంటి భారీ ప్రాజెక్టులకు ఎస్కార్ట్ ఆఫీసర్లుగా ఐఎఎస్ అధికారులను నియమించి.. ఎటువంటి ఇబ్బందులు లేకుండా వేగంగా ప్రాజెక్టులు పూర్తి చేస్తామని సిఎం అన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ నేడు ఇంధన శాఖతో చేసుకున్న ఈ ఒప్పందాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ట్రాన్స్ కో జెయింట్ మేనేజింగ్ డైరెక్టర్ కీర్తిని ఎస్కార్ట్ ఆఫీసర్ గా నియమిస్తున్నామని సీఎం తెలిపారు. రిలయన్స్ తో ఒప్పందం సంతోషకరమని.. 500 సిబిజి ప్లాంట్స్ మూడేళ్లలో ఏర్పాటు అవుతాయని అన్నారు. ఒక్కో ప్లాంట్ రూ.130 కోట్లతో రూ.65 వేల కోట్ల పెట్టుబడులు.. 2.5 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయని సీఎం తెలిపారు. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు...పర్యావరణానికి మేలు జరుగుతుందని సీఎం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున సాలిడ్ వేస్ట్ ను ప్లాంట్స్ కు ఇస్తామని...వాటి ద్వారా కూడా గ్యాస్ ఉత్పత్తి చేయాలని సిఎం సూచించారు. మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ద్వారా కూడా ఉత్పత్తి సాధ్యం అయ్యేలా ప్లాంట్ల నిర్మాణం చేపడతామని రిలయన్స్ ప్రతినిధులు తెలిపారు. క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 తెచ్చాం. దీని ద్వారా రూ.10 లక్షల కోట్లు పెట్టుబడులు సాధించాలి అని లక్ష్యంగా పెట్టుకున్నామని, క్లీన్ ఎనర్జీపై యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నామని సీఎం అన్నారు. క్లీన్ ఎనర్జీ పాలసీ మంచి ఫలితాలు తెస్తుందని, సోలార్, విండ్ తో పాటు పంప్డ్ ఎనర్జీ కోసం వెళుతున్నాం అని సిఎం అన్నారు. ఒక కుటుంబం, ఒక పారిశ్రామిక వేత్త అనేది మా నినాదమని, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా కొత్త ఆవిష్కరణలు తీసుకువస్తామని తెలిపారు. రిలయన్స్ లాంటి సంస్థలు దీనికి సహకరించాలని కోరారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనకు మంత్రి లోకేష్ సబ్ క్యాబినెట్ చైర్మన్ గా ఉన్నారని...ఆ బాధ్యతను నెరవేర్చే క్రమంలో నేటి ఒప్పందం కీలక ముందడుగు అన్నారు. మంత్రులు గొట్టిపాటి రవి కుమార్, టీజీ భరత్ లు వేగంగా నిర్ణయాలు తీసుకుని ప్రాజెక్టు ఒప్పందం జరగడానికి దోహద పడ్డారని ముఖ్యమంత్రి ప్రశంసించారు.
20 లక్షల ఉద్యోగాల కల్పనలో కీలక అడుగు: నారా లోకేష్
రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థతో జరిగిన నేటి ఒప్పందం 20 లక్షల ఉద్యోగాల కల్పనకు ఇది ముందడుగని మంత్రి నారా లోకేష్ అన్నారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన పై ఏర్పాటైన మంత్రుల సబ్ కమిటీకి చైర్మన్ గా ఉన్న మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. తమ లక్ష్య సాధనలో 2.5 లక్షల ఉద్యోగాలు ఈ ఒప్పందం ద్వారా వస్తాయని చెప్పారు. కొద్ది రోజుల ముందు ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీలతో జరిగిన చర్చల్లో వచ్చిన ప్రతిపాదనపై నేడు ప్రభుత్వం ఒప్పందంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మొత్తం 2 వేల ప్లాంట్లు దేశ వ్యాప్తంగా పెట్టాలని రిలయన్స్ లక్ష్యంగా పెట్టుకోగా అందులో 500 ప్లాంట్లు ఎపిలో పెట్టడం శుభపరిణామం అన్నారు. ఒప్పందం మేరకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని.. సాధ్యమైనంత వేగంగా ప్రాజెక్టను ముందుకు తీసుకువెళ్లాలని లోకేష్ కోరారు. ఈ క్రమంలో ఏ అవసరం వచ్చినా తాను వెంటనే స్పందిస్తానని.. ఏ సమస్య వచ్చినా వాట్సాప్ మేసేజ్ ఇస్తే చాలని రిలయన్స్ ప్రతినిధులకు సూచించారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ రిలయన్స్ 8 జిల్లాల్లో ప్లాంట్లు పెడుతుందని తెలిపారు. మొదటి ప్లాంట్ ప్రకాశం జిల్లా కనిగిరిలో పెడుతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన ఈ ఒప్పంద కార్యక్రమంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ముంబై ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, బోర్డు సభ్యుడు పి.ఎం.ఎస్. ప్రసాద్, రిలయన్స్ బయోఎనర్జీ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బషీర్ షిరాజీ తో పాటు ఆ సంస్థ ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.