వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులందరికీ 3 పూటలా ఆహారం అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు చేరుకోలేని చోట హెలికాప్టర్లు, డ్రోన్లను వినియోగించాలని సూచించారు. రెండు రోజులు ఆహారం, నీరు లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకుని పని చేయాలని కోరారు. ఇవాళ 5 హెలికాప్టర్ల ద్వారా ఆహారం పంపిణీ చేస్తున్నట్టు అధికారులు ఆయనకు తెలిపారు. వరద బాధిత ప్రాంతాల్లో వంద శాతం ఆహార పంపిణీ జరగాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారులు సర్వశక్తులూ ఒడ్డి పని చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
సరిగ్గా పనిచేయకపోతే సహించేది లేదని హెచ్చరించారు. ఇవాళే జక్కంపూడిలో ఓ అధికారిని సస్పెండ్ చేసినట్టు తెలిపారు. ఐదేళ్లుగా అధికార వ్యవస్థలేవీ పని చేయలేదని విమర్శించారు. విజయవాడలో వరద బాధితుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉందన్నారు. ఇళ్లలోకి పాములు, తేళ్లు, వస్తున్నాయని, ఆహారం అందలేది ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని సీఎం చంద్రబాబు.. మంత్రులను హెచ్చరించారు. మంత్రులపై కూడా చర్యలు ఉంటాయని చెప్పారు. వైఎస్ జగన్ రాజకీయం కోసం విమర్శలు చేయడం మానుకుంటే మంచిదని హితవు పలికారు. ఒక్క చోటైనా జగన్ బాధితులకు సాయం అందించారా? అని ప్రశ్నించారు.