ఏపీలో మొదలైన సినిమా థియేటర్ల సీజ్..!
Theatres Seized In AP. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో థియేటర్లపై అధికారులు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇటీవలి కాలంలో
By Medi Samrat Published on 21 Dec 2021 2:50 PM GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో థియేటర్లపై అధికారులు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇటీవలి కాలంలో పలు నగరాల్లోనూ, మండలాల్లోనూ అధికారులు సోదాలను నిర్వహించి సీజ్ చేస్తూ ఉన్నారు. ఏపీ ప్రభుత్వం నిర్వహించిన సినిమా టికెట్ల అంశమే కాకుండా మరిన్ని విషయాలపై అధికారులు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. విజయనగరం జిల్లాలో మూడు సినిమా థియేటర్లను అధికారులు సీజ్ చేశారు. నిబంధనలను పాటించని సినిమా థియేటర్లపై జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డాక్టర్ కిశోర్ కుమార్ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. మూడు సినిమా హాళ్లను మూసివేయాలని తాహశీల్దార్‌ను ఆదేశించారు.
పూసపాటిరేగ, భోగాపురం, నెల్లిమర్ల మండలాల్లో మంగళవారం ఆకస్మికంగా పర్యటించి, సినిమా థియేటర్లను ఆయన తనిఖీ చేశారు. ముందుగా పూసపాటిరేగ సాయికృష్ణా థియేటర్‌ను పరిశీలించారు. ఈ థియేటర్‌లో ఫైర్ సేఫ్టీ లైసెన్స్ 2015 నుంచి రెన్యువల్ చేయకపోవడాన్ని గుర్తించి, తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. థియేటర్‌ను సీజ్ చేయాలని తాహశీల్దార్‌ను ఆదేశించారు. అనంతరం భోగాపురం మండలం గోపాలకృష్ణ థియేటర్‌ను జేసీ తనిఖీ చేశారు. సినిమా టిక్కెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించి.. ఈ థియేటర్‌ను కూడా సీజ్ చేయాలని జేసీ ఆదేశించారు. నెల్లిమర్ల లోని ఎస్ త్రి సినిమాస్ థియేటర్ ను కూడా తనిఖీ చేశారు. టిక్కెట్లు అధిక ధరలకు విక్రయిస్తున్న ఈ సినిమా హాలును కూడా సీజ్ చేయాలని ఆదేశించారు.