ఏపీలో సీజ్ చేసిన థియేటర్లు తెరచుకోవచ్చు

Theatre Owners Meet With Minister Perni Nani. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిబంధ‌న‌లు పాటించని సినిమా థియేటర్లను ఇటీవ‌ల అధికారులు

By Medi Samrat  Published on  30 Dec 2021 12:23 PM IST
ఏపీలో సీజ్ చేసిన థియేటర్లు తెరచుకోవచ్చు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిబంధ‌న‌లు పాటించని సినిమా థియేటర్లను ఇటీవ‌ల అధికారులు మూసివేయించారు. పలువురు థియేటర్‌ యజమానులు ఈరోజు ఏపీ మంత్రి పేర్ని నానిని క‌లిసి చ‌ర్చించారు. ఆ త‌ర్వాత ప్రభుత్వం కీల‌క‌ ఉత్తర్వులు జారీచేసింది. ఏపీలోని తొమ్మిది జిల్లాల్లో సీజ్‌ చేసిన 83 థియేటర్లను తెరుచుకునేందుకు అనుమతి ఇస్తున్న‌ట్లు పేర్కొంది. ఇందుకోసం ఆయా థియేట‌ర్ల య‌జ‌మానులు జిల్లా జాయింట్ కలెక్టర్ కు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి పేర్ని నాని చెప్పారు. ప్రభుత్వ అధికారులు గుర్తించిన లోపాలను థియేటర్ల యజమానులు సరిదిద్దుకోవాలని చెప్పారు. ఆయా థియేటర్లలో నెల రోజుల్లో అన్ని వసతులు కల్పించాల‌ని ఆయ‌న సూచించారు.

ఆయా థియేట‌ర్ల విష‌యంలో ఇస్తోన్న సడలింపులపై జిల్లాల‌ జాయింట్‌ కలెక్టర్లకు ఆదేశాలిచ్చినట్లు మంత్రి పేర్ని నాని మీడియాకు తెలిపారు. మచిలీపట్నంలో మంత్రి పేర్ని నానితో సినీ నటుడు, నిర్మాత ఆర్‌ నారాయణమూర్తి, పలువురు సినిమా థియేటర్స్‌ ఓనర్లు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో థియేటర్ల ఓనర్లకు ఊరటనిస్తూ మంత్రి పేర్ని నాని హామీ ఇచ్చారు. సీజ్‌ చేసిన థియేటర్లు తిరిగి ఓపెన్‌ చేసేందుకు అనుమతిచ్చారు. థియేటర్లలో అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. నెలరోజుల గడువు ఇచ్చారు. మంత్రి హామీతో 9 జిల్లాల్లో 83 థియేటర్లకు ఊరట లభించనుంది.


Next Story