పొట్టి శ్రీరాములు ఒక జాతికి, కులానికి నాయకుడు కాదు. పొట్టి శ్రీరాములు ఆంధ్ర జాతికి నాయకుడని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. స్వాతంత్ర్యానంతరం భారతదేశంలో 562 రాజ్య సంస్థానాలను విలీనం చేసి బలమైన భారతదేశాన్ని నిర్మించిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కీర్తించారు. ప్రతీ ఒక్కరికీ అభివృద్ధి ఫలాలు అందించేలా.. అన్ని రంగాలకు సమగ్రాభివృద్ధి దిశగా తీసుకెళ్లేలా రాష్ట్రాన్ని 2.2 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టే దిశగా స్వర్ణ ఆంధ్ర విజన్ 2047 అమలు చేసి లక్ష్యాలు సాధించడమే పొట్టి శ్రీరాములకు మనం అందించే నిజమైన నివాళి అన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత పొట్టి శ్రీరాములు త్యాగం విలువ అర్థమైందని పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన 58 రోజుల పాటు కఠోర ఆమరణ నిరహార దీక్ష చేపట్టి ప్రాణత్యాగం చేసి ఆంధ్ర రాష్ట్రం సిద్దించేలా చేశారు. పొట్టి శ్రీరాములు ఆత్మబలిదానం తరవాత ఆయన భౌతిక కాయం మొయ్యడానికి కూడా నలుగురు లేని పరిస్థితి బాధాకరం అన్నారు. ఘంటసాల లాంటి కొంతమంది మహానుభావులు ఆరోజు నిలబడ్డారు. ఆయన త్యాగ ఫలితం ఆంధ్ర రాష్ట్రం. మద్రాసులో తెలుగు వారిని మద్రాసీలు అంటుంటే, నేను తెలుగువాడిని అని ఆత్మగౌరవంతో నినదించిన వ్యక్తి నందమూరి తారక రామారావు అన్నారు.