అమరావతి: జిల్లాల విభజనపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ రేపు మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం కానుంది. సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. కాగా రేపటి భేటీలో జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల విభజనపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే సీఎం చంద్రబాబుకు కేబినెట్ సబ్ కమిటీ నివేదిక సమర్పించనుంది. అనంతరం ఈ నెల 10వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో జిల్లాల విభజనపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది.  
ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా విభజన ప్రక్రియను గత వైసీపీ ప్రభుత్వం చేపట్టింది. 13 జిల్లాలను 26కి పెంచినప్పటికీ  ప్రాంతీయ అసమానతలు, పరిపాలనా సమస్యలు తలెత్తాయి. ప్రజల అభిప్రాయాలను పక్కనపెట్టి, రాజకీయ లాభాల కోసం జరిగిన ఈ మార్పులు రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకిగా మారాయని ప్రస్తుత కూటమి ప్రభుత్వం భావిస్తోంది. 2024 ఎన్నికల్లో జిల్లాల పునర్ వ్యవస్థీకరిస్తామని హామీ ఇచ్చింది. భవిష్యత్ లో అసెంబ్లీ నియోజకవర్గాల  డీలిమిటేషన్‌ను దృష్టిలో ఉంచుకుని, పోలవరం  ముంపు గ్రామాల పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని నిర్ణయించారు.