సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టిన ఏపీసీసీ..ఎందుకు అంటే?
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టింది
By - Knakam Karthik |
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టింది. సోమవారం నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు ఓటో చోరీపై సంతకాల సేకరణ చేపట్టాలని ఏపీసీసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సంతకాల సేకరణ ఉద్యమానికి రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కోరారు.
ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. దేశప్రజల ఓటు హక్కు కాపాడటం కోసం పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది. భారతదేశ రాజ్యాంగం మనకు ఓటు హక్కు కల్పించింది. మన నాయకులను మనం ఎన్నుకొనే స్వేచ్ఛ ఇచ్చింది. ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉంది. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ECI నిర్వహించాలి. కానీ ఎన్నికలసంఘం ప్రధాని మోడీ గారి చేతిలో బంధి అయ్యింది. CBI, ED, INCOME TAX, RBI, స్టాక్ ఎక్స్ఛేంజ్ లాంటి అన్ని వ్యవస్థలు మోడీ గారి గుప్పెట్లో బీజేపీ కోసం పని చేస్తున్నాయి. ఎన్నికల సంఘం కూడా బీజేపీ కోసమే పని చేస్తుంది. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ గారు దేశం ముందు బయటపెట్టారు. ఇది పచ్చి నిజం. ఇది మన భారత దేశ ప్రజాస్వామ్య యదార్ధత అని రాహుల్ గాంధీ గారు దేశం ముందు ECI బండారాన్ని బయట పెట్టారు...అని షర్మిల పేర్కొన్నారు.
కర్ణాటకలోని మహాదేవపుర నియోజక వర్గాన్ని ఒక శాంపిల్ గా తీసుకున్నారు. ఒక లక్ష దొంగ ఓట్లను నమోదు చేశారు. అన్ని దొంగ ఫొటోలు, దొంగ పేర్లు, దొంగ అడ్రస్‌లు. అంతేకాకుండా మహారాష్ట్ర ఎన్నికల్లో సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో 60 లక్షలకు పైగా కొత్త ఓట్లు పోల్ అయ్యాయి. ఈ ఓట్లు ఎవరు వేశారు ? CCTV ఫుటేజ్ ఎక్కడ ఉంది ? అంటే ECI ఏ ఆధారాలు లేవు. అలాగే 5 ఏళ్లలో కంటే ఎన్నికలకు 5 నెలల ముందు కోటికి పైగా కొత్త ఓట్లు నమోదు అయ్యాయి. ఇది అన్యాయం కాదా ? ఓట్ చోరీ కోసం ఇదంతా చేయలేదా ? ఎన్నికల సంఘం బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ ఓట్లను తొలగించింది. బీజేపీకి అనుకూలంగా దొంగ ఓట్లను నమోదు చేసింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీ ఎలక్షన్ ఏజెంట్ గా పని చేస్తుంది. ఓట్ చోరీ పై దేశ వ్యాప్త పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఒక పోరాటాన్ని ఎత్తుకున్నాం. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు కావాలి. సంతకం కూడా కావాలి. మాతో కలిసి పోరాటం చేయాలని రాష్ట్ర ప్రజలకు మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నా..అని షర్మిల కోరారు.