నేరం జరిగిన 100 రోజుల్లో శిక్ష :హోంమంత్రి అనిత
నేరం జరిగిన వంద రోజుల్లోగా శిక్ష అమలు చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం లక్ష్యంతో ముందుకెళుతోందని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు.
By Medi Samrat Published on 1 March 2025 8:30 PM IST
నేరం జరిగిన వంద రోజుల్లోగా శిక్ష అమలు చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం లక్ష్యంతో ముందుకెళుతోందని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ప్రజలు, పోలీసుల భాగస్వామ్యంతో ఆ లక్ష్యాన్ని సాధిస్తామని ఆమె స్పష్టం చేశారు. విజయనగరం జిల్లాలో నమోదైన ఫోక్సో కేసులో 100 రోజుల్లోనే నిందితుడికి శిక్ష పడేలా చేసినట్లు పేర్కొన్నారు. ప్రజల భద్రత విషయంలో పోలీసుల పాత్ర వెలకట్టలేనిదన్నారు. అనంతపురం జిల్లా పీటీసీ పరేడ్ మైదానంలో శనివారం జరిగిన శిక్షణ ఎస్సైల పాసింగ్ అవుట్ పరేడ్ కు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హోంమంత్రి ప్రసంగిస్తూ.. ఉన్నతమైన చదువులు చదివి పోలీస్ వృత్తిపై గల అంకితభావంతో 394 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు శిక్షణ పూర్తి చేసుకోవడం వల్ల హోంశాఖకు మరింత బలం చేకూరిందన్నారు. శిక్షణ పొందిన వారిలో 300 సివిల్, 94 మంది ఏపీఎస్పీ ఎస్సైలు, ఒకరు ఏఆర్ ఎస్సై లున్నట్లు వివరించారు. మొత్తం ఎస్ఐలలో ఏకంగా 97 మంది మహిళా సబ్ఇన్‌స్పెక్టర్లుండడం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. పోలీస్ గా సేవలందించేందుకు మహిళలైనా సిద్ధమై కఠిన పరీక్షలు ఎదుర్కోవడం ప్రశంసనీయమన్నారు. యువరక్తం ఉత్సహంతో పని చేయడమే కాకుండా టెక్నాలజీని ఉపయోగించుకుని నేర నియంత్రణ చేస్తామని హోంమంత్రి తెలిపారు. శాంతి భద్రతల కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.కేసు నమోదు చేసిన వెంటనే నిందితులపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామన్నారు.
సివిల్ ఇండోర్, అవుట్ డోర్ విభాగాల శిక్షణలో అత్యుత్తమ ప్రదర్శన కనబరచిన ఎస్సైలను మెడల్, సర్టిఫికెట్, చీఫ్ మినిస్టర్ పిస్టల్ తో హోంమంత్రి అనిత సత్కరించారు. సివిల్ విభాగం ఫైరింగ్ లో ప్రతిభ చాటిన ఎస్సైలకు ట్రోఫీ అందించారు. సివిల్ విభాగం ఫైరింగ్ ఇండోర్, అవుట్ డోర్ లో ప్రతిభ చాటిన విజేతలను ప్రశంసించారు. ఏపీఎస్పీ విభాగాల్లోని ఇండోర్, అవుట్ డోర్, ఫైరింగ్, ఆల్ రౌండ్ ప్రతిభ కనబరచిన ఎస్సైల ప్రతిభను కొనియాడారు. ఎస్ఐల శిక్షణ పూర్తి కావడం హోంశాఖ కుటుంబ సభ్యురాలిగా తనకెంతో గర్వకారణమన్నారు. పోలీస్ శాఖలో ప్రజలకు సేవ చేస్తున్న ప్రతి పోలీస్ తనకు తోబుట్టువుతో సమానమన్నారు. ప్రజలకు కష్టమొస్తే దేవుడి తర్వాత పోలీసుల దగ్గరకు వెళ్లి చెప్పుకుంటారన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 9 నెలల్లో లక్ష కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు హోంమంత్రి తెలిపారు. ఏఓబీ సరిహద్దుల్లో వేల ఎకరాల గంజాయి సాగును ప్రక్షాళన చేశామన్నారు. పోలీసుల సంక్షేమంపై ప్రత్యేకంగా ప్రభుత్వం దృష్టిసారించినట్లు తెలిపారు. లక్ష సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడమే కూటమి ప్రభుత్వ తదుపరి లక్ష్యమన్నారు. ఈవ్ టీజింగ్, గంజాయి రవాణా, సాగు వంటి నేరాలను అరికట్టడానికి సీసీ కెమెరాలు, డ్రోన్లు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ కి రెండు డ్రోన్లు అందుబాటులో ఉంచుతామన్నారు. గత ప్రభుత్వం పోలీస్ శాఖకు ఐదేళ్లలో రూ.900 కోట్ల బకాయిలు పెట్టగా వాటిని కూటమి ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు.గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇంతవరకు ఏపీకీ అప్పా లేదు.. గ్రే హౌండ్స్ బెటాలియన్ లేదని విమర్శించారు. త్వరలో అప్పాకు భూమి పూజ చేయనున్నట్లు హోంమంత్రి వెల్లడించారు. ఇన్విజిబుల్ పోలీసింగ్ కు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.
అంతర్యుద్ధం అంటూ వ్యాఖ్యలు చేసిన వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు హోంమంత్రి అనిత తనదైన శైలిలో బదులిచ్చారు. వైసీపీలో ముందు అంతర్యుద్ధం రాకుండా ఆ పార్టీ నాయకులు చూసుకోవాలన్నారు. నోరు ఉంది కదా అని రెచ్చిపోవడానికి ఇది గత ప్రభుత్వం కాదు..కూటమి ప్రభుత్వమని తేల్చి చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వంలో తప్పు చేసినవాడు ఎవడైనా శిక్ష తప్పదని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం చట్ట ప్రకారమే ముందుకు వెళ్తుందన్నారు. రెడ్ బుక్ ప్రకారం ముందుకెళ్తే వైసీపీ నేతలెవరూ రోడ్లపై తిరగలేరన్నారు. పోసానిపై రాష్ట్రవ్యాప్తంగా 17 కేసులు నమోదైనట్లు హోంమంత్రి తెలిపారు. పోసానికి స్క్రిప్ట్ ఎవరిచ్చినా.. అనుభవించేది రాజానే అన్నారు. ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడితే చర్యలు తప్పవన్నారు. పోసాని వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయన్నారు. ఏది పడితే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదనారు. నారా లోకేశ్ ,పవన్ కళ్యాణ్ కుటుంబంపై పోసాని వ్యాఖ్యలను ఏ ఒక్కరైనా సమర్థిస్తారా? అంటూ ఆమె ప్రశ్నించారు.