రూ. 5 లక్షల నగదుకు చెదలు.. క‌న్నీటి సంద్రంలో బాధితుడు

Termites Consumed Man Savings. సొంత గూడు కోసం కూడపెట్టిన డబ్బు.. చెదలు పట్టి చిత్తుకాగితాలుగా మారాయ‌ని గగ్గోలు

By Medi Samrat  Published on  16 Feb 2021 3:05 PM GMT
Termites Consumed Man Savings.

సొంత గూడు కోసం కూడపెట్టిన డబ్బు.. చెదలు పట్టి చిత్తుకాగితాలుగా మారాయ‌ని గగ్గోలు పెడుతున్నారు ఆ ఇంట్లో మనుషులు. టెక్నాలజీ పుంతలు తొక్కి డిజిటలైజేషన్ ప్రపంచాన్ని చుట్టుముడుతుంటే కనీసం బ్యాంకులో కూడా కాకుండా ట్రంకు పెట్టెలో ఏకంగా 5లక్షలు దాచిపెడితే ఆ డబ్బుకి చెదలు పట్టాయి. చివరికి చిన్న పిల్లలు కూడా ఆడుకోడానికి పనికి రాకుండా పోయాయి. అసలు వీరి సొంత డబ్బేనా? లేక ఎక్కడైనా దొరికాయా అని పోలీసులు కూపీ లాగుతున్నారు.


పూర్తి వివరాలలోకి వెళితే.. మైలవరం వాటర్ ట్యాంక్ వద్ద పందుల వ్యాపారం చేసుకునే బిజిలి జమలయ్య తన వ్యాపారంలో వచ్చిన లాభాలను బ్యాంక్ అకౌంట్ లేకపోవడంతో కుటుంబ సభ్యులను నమ్మలేక ట్రంకు పెట్టెలో దాచిపెట్టి భద్రం చేసుకున్నాడు. ఒక పది లక్షలు పోగు చేసి మంచి ఇల్లు కట్టుకుందామనుకున్నాడు. సుమారు 5లక్షల రూపాయలు దాచిపెట్టాడు. అకస్మాత్తుగా వ్యాపారానికి ఒక లక్ష కట్టాల్సి వచ్చి రాత్రి తన ట్రంకు పెట్టె తెరిచాడు. లోపలున్న డబ్బులు చూసి బావురుమన్నాడు. నీరసంతో సొమ్మసిల్లి పడిపోయాడు. ఉదయాన్నే ట్రంకు పెట్టెలో చెదలు పట్టిన డబ్బు తీసి మంచంపై వేసి లెక్కపెట్టడం ప్రారంభించారు. చుట్టుప్రక్కల వారికి తెలియడంతో ఆనోటా ఆనోటా పోలీసులకు సమాచారం అందింది.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జమలయ్య ఇంటికి వెళ్ళి ఆరా తీశారు. పోలీసులను చూడడంతో నే బావురుమంటూ తమ భాధ వెళ్ళగక్కారు జమలయ్య కుటుంబీకులు. చెదలు పట్టిన నోట్లతో చిన్న పిల్లలు ఆడుకోవడం చూసి స్థానికులు నోరెళ్ళబెట్టారు. తమకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
Share it