ఏపీలో పదో తరగతి ఫలితాలు శుక్రవారం సాయంత్రం విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడలో ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను www.bse.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల డైరక్టర్ తెలిపారు. ఇదిలావుంటే.. కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన రద్దు చేసిన సంగతి తెలిసిందే. విద్యార్థులకు గ్రేడ్లు ఎలా ఇవ్వాలన్న దానిపైన ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఇచ్చిన సిఫార్సులకు అనుగుణంగా.. 2020 మార్చి, 2021 జూన్‌కు సంబంధించి విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా విద్యార్థుల ప్రతిభ ఆధారంగా గ్రేడ్లు విడుదల చేశారు.
ఫలితాలు తెలుసుకోండిలా..
2020 విద్యార్థులు : ఈ సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులకు ఆల్‌పాస్‌గా ప్రకటించి గతంలో ధ్రువపత్రాలు ఇచ్చారు. వాటిలో వారి హాల్‌టికెట్ల నంబర్లను పొందుపరిచారు. ఆ హాల్‌టికెట్ నంబర్ ఆధారంగా విద్యార్థులు సబ్జెక్టుల వారీగా తమ గ్రేడ్లు తెలుసుకోవచ్చు.
2021 విద్యార్థులు : ఈ సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులు ఫలితాల పోర్టల్‌లో తమ జిల్లా, మండలం, పాఠశాల, తమ పేరు, పుట్టిన తేదీని నమోదు చేసి సబ్జెక్టుల వారీగా గ్రేడ్లు తెలుసుకోవచ్చు.