శ్రీ సత్యసాయి జిల్లాలో రైతు సమస్యలపై చలో కలెక్టరేట్‌కు టీడీపీ పిలుపునిచ్చింది. అయితే పుట్టపర్తి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న నేతలను పోలీసులు అడ్డుకున్నారు. రామగిరిలో మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌లను కూడా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సునీత పోలీసులతో వాగ్వాదానికి దిగి రైతుల సమస్యలపై కలెక్టరేట్‌కు వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఒకే వాహనంలో వెళ్లాలని పోలీసులు సూచించడంతో.. పోలీసుల తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ నియంతృత్వ వైఖరిని ఎండగడుతూ బారికేడ్లు దాటుకుని ముందుకు సాగారు.
మరోవైపు అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. చలో కలెక్టరేట్‌పై పోలీసులు ముందస్తుగా అప్రమత్తమై చౌదరిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. రైతాంగం సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారని, అన్నదాతల సమస్యలు పరిష్కరించకుండా సీఎం జగన్ జిల్లాకు ఎలా వస్తారని ప్రభాకర్ మండిపడ్డారు. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత సీఎంపై ఉందన్నారు. మేం ప్రజల పక్షాన పోరాడుతుంటే అడ్డుకోవడం, అణచివేయడం సరికాదని ప్రభాకర్ చౌదరి మండిపడ్డారు.
మరోవైపు జిల్లా కలెక్టరేట్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఎదురుగా వెళ్లే వాహనాలను సంఘటనా స్థలానికి మళ్లించి కలెక్టరేట్‌కు అన్ని వైపులా నారికేడ్లు ఏర్పాటు చేశారు. కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లే వాహనాలు, వ్యక్తులను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతిస్తున్నారు.