జనసేన ఎంపీ బాలశౌరి కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎంపీ బాలశౌరి పీఏ గోపాల్ సింగ్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేశారంటూ బాధితులు ఎంపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. కృష్ణా యూనివర్సిటీ, మెడికల్ కాలేజ్, విద్యుత్ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేశాడని బాధితులు ఆరోపించారు.
తమకు న్యాయం చేయాలని బాధితులు ధర్నాకు దిగారు. గతంలో ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లు కూడా ఇచ్చాడని, ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా అపాయింట్మెంట్ లెటర్లు గడువు ముగిశాయని తప్పించుకునే ప్రయత్నం చేశాడన్నారు. ఎంపీ కార్యాలయం ఎదుట బాధితులు ఆందోళనకు దిగటంతో పోలీసులు వారిని అక్కడ నుండి వెళ్లాలని కోరారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. గోపాల్ సింగ్ పలువురు నిరుద్యోగుల నుండి ఉద్యోగాల పేరుతో కోటిన్నర రూపాయల వరకు వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. 60 మంది వద్ద దాదాపు రెండు లక్షల రూపాలయల చొప్పున వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి.