సీఎం అయ్యాక తొలిసారి ఏపీకి వెళ్తున్న రేవంత్‌రెడ్డి, భారీ కటౌట్లు ఏర్పాటు

పార్టీ కేడర్‌ను సిద్ధం చేసేందుకు కాంగ్రెస్‌ సభలు, సమావేశాలు నిర్వహిస్తోంది.

By Srikanth Gundamalla  Published on  16 March 2024 5:15 AM GMT
telangana, cm revanth reddy, andhra pradesh, tour, vizag,

సీఎం అయ్యాక తొలిసారి ఏపీకి వెళ్తున్న రేవంత్‌రెడ్డి, భారీ కటౌట్లు ఏర్పాటు

లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇవాళే ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది. దాంతో.. ఆయా రాజకీయ పార్టీలన్నీ సన్నద్ధం అవుతున్నాయి. ఏపీలో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ క్రమంలో పార్టీ కేడర్‌ను సిద్ధం చేసేందుకు కాంగ్రెస్‌ సభలు, సమావేశాలు నిర్వహిస్తోంది. విశాఖలో శనివారం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తోంది. తృష్ణా మైదానంలో ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో పాటు పలువురు జాతీయ నేతలు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు.

న్యాయసాధన సభ పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తోంది ఏపీ కాంగ్రెస్‌. తెలంగాణ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రేవంత్‌రెడ్డి తొలిసారి ఏపీలో కాంగ్రెస్ సభకు వెళ్తున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతల భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కటౌట్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రత్యేక విమానంలో సీఎం రేవంత్‌రెడ్డి విశాఖ ఎయిర్‌పోర్టుకు వెళ్తారు. అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు సభా ప్రాంగణానికి వెళ్తారు. విమానాశ్రయం నుంచి సభా ప్రాంగణం వరకు భారీ ఎత్తున ఫ్లెక్సీలను ఉంచారు.




కాగా.. ఈ సభ ద్వారా విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు సంబంధించి కాంగ్రెస్‌ డిక్లరేషన్‌ ప్రకటించనుంది. ఈ సభకు దాదాపు 70వేల మంది హాజరు అయ్యేలా చూస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ఈ సభను విజయవంతం చేసే బాధ్యతను ఉత్తరాంధ్రలోని పార్టీ నేతలు, ఇన్‌చార్జులకు బాధ్యతలను అప్పగించారు. ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం 2వేల మందిని తీసుకురావాలని సూచించారు.

Next Story