ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ ఫ్లెక్సీని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఏర్పాటు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భీమ్లా నాయక్ సినిమా విడుదల సందర్భంగా తెలంగాణలో టికెట్ ధరలు, అదనపు షోకు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దీన్ని స్వాగతిస్తూ పవన్ అభిమానులు.. ఫ్లెక్సీ ఏర్పాటు చేసి 'హ్యాట్సాఫ్ సీఎం సార్..' అంటూ కేసీఆర్ మీద తమ అభిమానాన్ని చాటుకున్నారు. విజయవాడ కృష్ణలంకలోని ఫైర్ స్టేషన్ సమీపంలో ఈ భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాకు ఏపీలో అడుగడుగున అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. ఇప్పటికే అక్కడ టికెట్ రేట్ల ఇష్యూతో చాలా తంటాలు పడుతున్నారు నిర్మాతలు. ఇప్పుడు అవే కష్టాలు విడుదల తర్వాత కూడా కంటిన్యూ అవుతున్నాయి. గతేడాది వకీల్ సాబ్ నుంచి కూడా ఇదే జరుగుతుంది. తాజాగా భీమ్లా నాయక్‌కు కొనసాగుతున్నాయి. దీంతో ఎంతో ఆశగా పవన్ సినిమా కోసం ఎదురు చూసిన ఫ్యాన్స్‌కు నిరాశ మిగిలింది. అదనపు షోలను ఆపేసారు. అలాగే టికేట్ల ధరలు పెంచవద్దని రెవిన్యూ అధికారులు థియెటర్ల యాజమాన్యాలను హెచ్చరించారు.
ఈ మేరకు కొన్ని సినిమా హాల్స్ యాజమాన్యాలు స్వచ్ఛందంగా సినిమా ప్రదర్శనను నిలిపివేసారు. ఇప్పుడున్న టికెట్ రేట్స్‌తో తాము సినిమాను నడపలేమంటూ మూసేసారు. విస్సన్నపేటలో టికెట్ ధర ప్రభుత్వ లెక్క ప్రకారం రూ.35 ఉండాలి. దీంతో ఈ రేటుకి సినిమా ప్రదర్శన గిట్టుబాటు కాదని యాజమాన్యాలు బోర్డు పెట్టేశాయి. మైలవరంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.