దోపిడీదారుడు వంశీతో ఎందుకు ములాఖత్ అయ్యారు? జగన్‌కు టీడీపీ లేఖ
మాజీ ఎమ్మెల్యే వంశీతో వైసీపీ అధినేత జగన్ ములాఖత్ కావడంపై తెలుగు దేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు లేఖ రిలీజ్ చేశారు.
By Knakam Karthik
దోపిడీదారుడు వంశీతో ఎందుకు ములాఖత్ అయ్యారు? జగన్‌కు టీడీపీ లేఖ
విజయవాడ జైలులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీతో వైసీపీ అధినేత జగన్ ములాఖత్ కావడంపై తెలుగు దేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ లేఖ రిలీజ్ చేశారు. దళిత వ్యక్తి కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ వల్లభనేని వంశీ విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఆయనను ఈ రోజు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తీవ్ర ఆరోపణలు చేశారు. వంశీని టార్గెట్ చేసిన చంద్రబాబు ఆయనను అక్రమకేసుల్లో ఇరికించారని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు మద్దతుగా నిలుస్తున్న పోలీసులు సైతం వదిలిపెట్టబోమంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. దళిత వ్యతిరేకి, మహిళా ద్రోహి అయిన వల్లభనేని వంశీకి వైఎస్ జగన్ ఎందుకు మద్దతు గా నిలుస్తున్నాడని తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది.
ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పేరున పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో జగన్‌కు పలు ప్రశ్నలు వేసింది. దోపిడీదారుడు వంశీని జగన్ ఎందుకు ములాఖత్ అయ్యారో సమాధానం చెప్పాలని ఈ లేఖలో డిమాండ్ చేశారు. దళిత ఉద్యోగి సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి హింసించి హత్య చేస్తానని వంశీ బెదిరించాడని ఆరోపించారు. నీకు దళితుల కంటే నేరస్తులు ఎక్కువైపోయారా అని అన్నారు. ప్రజాస్వామ్య దేవాలయం అసెంబ్లీలోనే దుశ్శాసనుడిలా ప్రవర్తించి మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచిన నేరస్తుడిని జగన్ ఏ రకంగా పరామర్శించారని ప్రశ్నించారు. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టించి, గన్నవరం మహిళా కార్యకర్తలపై వంశీ అక్రమ కేసులు పెట్టించి వారాల తరబడి హింసించారని ఆరోపించారు. తల్లి, చెల్లిపై సభ్యకరంగా పోస్టులు పెట్టించిన నీకు ఇతర మహిళలపైన గౌరవం ఉంటుందా అంటూ ఎద్దేవా చేశారు.
సంకల్ప సిద్ధి చిట్ ఫండ్స్ పేరుతో 16 మంది కుటుంబాలను వంశీ రోడ్డున పడేశారని అన్నారు. పట్టిసీమ గట్టు మట్టిని అక్రమంగా తరలించిన రైతుల ద్రోహి వంశీ అని పేర్కొన్నారు. గన్నవరం నియోజకవర్గ ప్రజలకు 119 ఇళ్ల పట్టాలి ఇచ్చి సొంత ఇంటి కలలు దూరం చేశారని ఆరోపించారు. బావులపాడు గన్నవరం, మండపల్లి ప్రాంతాల్లో చెరువులను కొండలను అక్రమంగా తగ్గించి గ్రావెల్ అమ్ముకున్న మాఫియా వంశీ అని తీవ్ర ఆరోపణలు చేశారు. ఎయిర్ పోర్టు భూములను సైతం కబ్జా చేశాడని అన్నారు. ఇటువంటి దోపిడీ దారుడు వంశీతో జగన్ ఎందుకు ములాఖత్ అయ్యారు చెప్పాలని ఆ లేఖలో ప్రశ్నించారు.