టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయారని మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు. ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సోమవారం ఉదయం తిరుమలకు వచ్చిన రోజా.. వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి ప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం మీడియతో మాట్లాడిన ఆమె టీడీపీ నేత చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే పోలవరం పూర్తి చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేని వ్యక్తి ముంపు ప్రాంతాలను జిల్లాలుగా ఎలా మారుస్తారని రోజా ప్రశ్నించారు.
చంద్రబాబును ప్రజలు నమ్మరని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయకుండా అప్పులు చేశారని ఆమె విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో నగదు కొరత ఉన్నప్పటికీ.. సీఎం జగన్ పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని అన్నారు. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంగా ఉపయోగించుకున్నారని ఆరోపించారు. కుప్పం ను మున్సిపాలిటీగా కూడా చేయలేని చంద్రబాబు ముంపు గ్రామాలను జిల్లా చేస్తాననడం విచిత్రంగా ఉందన్నారు.