మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ కార్యాలయాన్ని తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం బుధవారం ముట్టడించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే అప్పటికే అక్కడ మోహరించిన వందలాది మంది పోలీసులు తెలుగుదేశం పార్టీ మహిళా నేతలను కార్యాలయంలోకి రాకుండా అడ్డుకున్నారు. దీంతో తెదేపా మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో తెలుగు మహిళలు కమిషన్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. విజయవాడ అత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యులు ఇందులో పాల్గొన్నారు.
మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసే హక్కు ఉందని అనిత అన్నారు. ఆసుపత్రిలో అత్యాచారం కేసులో నిర్లక్ష్యంపై ఆమె ప్రశ్నించారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను అవమానించినందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ సీనియర్ నేత బోండా ఉమాకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు వారు కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే.. నోటీసులు జారీ చేసే అధికారం మహిళా కమిషన్‌కు లేదని టీడీపీ వ్యాఖ్యానించగా.. బోండా ఉమ మాత్రం విచారణకు వెళ్లడం లేదని స్పష్టం చేశారు.