చంద్రబాబు ఇంటి వద్ద వైసీపీ వర్సెస్ టీడీపీ

TDP vs YSRCP. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు నివాసం ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి కోడెల శివప్రసాద్

By Medi Samrat  Published on  17 Sep 2021 9:53 AM GMT
చంద్రబాబు ఇంటి వద్ద వైసీపీ వర్సెస్ టీడీపీ

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు నివాసం ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ సంస్మరణ సభలో భాగంగా పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేశ్ నేతృత్వంలోని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి వద్దకు భారీగా తరలివచ్చారు. ఇంటి గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు కర్రలతో దాడి చేసుకున్నాయి. రెండు వర్గాల వారిని అదుపు చేసేందుకు భారీగా పోలీసులను మోహరించారు. వైసీపీ కార్యకర్తల నిరసన గురించి తెలిసి టీడీపీ కార్యకర్తలు భారీగా చంద్రబాబు నివాసానికి తరలివచ్చారు.

గుంటూరు జిల్లా నకరికల్లు మండలంలో నిన్న మాజీ స్పీకర్ దివంగత కోడెల శివప్రసాదరావు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. పనికిమాలినోళ్ల పాలనకు ఏపీ అద్దం పడుతోందన్నారు. తాను అధికారంలోకి వస్తే పెంచుకుంటూ పోతానని జగన్ ఎన్నికల ముందు చెప్పారని, పెంచడం అంటే పింఛను కాదని, పన్నులని విమర్శించారు. సీఎం మద్యం, మాంసం, చేపలు అమ్ముతాడా? చెత్త, మరుగుదొడ్లపై పన్ను వేసేవాడిని అలా అనక ఇంకెలా అంటారంటూ ఓ పదాన్ని ప్రయోగించారు.

తనపై ఎన్ని కేసులు పెట్టుకుంటారో, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నారు. సన్నబియ్యం అంటే తెలియనోడు పౌరసరఫరాల శాఖ మంత్రి అని, ఇరిగేషన్ మంత్రి బెట్టింగు రాయుడని పేర్కొన్న అయ్యన్న.. లేని దిశ చట్టంతో ఉరిశిక్ష, జీవితఖైదు వేస్తామంటున్న హోం మంత్రిని చూస్తుంటే జాలేస్తోందన్నారు. లేని చట్టం కోసం రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభించారని జగన్ ను ఉద్దేశించి మరోమారు తీవ్ర పద ప్రయోగం చేశారు. హోంమంత్రికి సిగ్గు, లజ్జ ఉంటే తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లక్షల కోట్ల రూపాయల అప్పులు చేస్తున్నారని ముఖ్యమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా వాళ్ల బ్లాక్ టికెట్లు కూడా అమ్ముతామంటున్నారని, ఇంటింటికి మల్లెపూలు అమ్ముకునే వ్యాపారం కూడా ప్రారంభించి దానికి అంబటి రాంబాబును అధ్యక్షుడిని చేయాలని అయ్యన్న సూచించారు.


Next Story
Share it