టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీని వీడుతున్నట్లు సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. పార్టీలో చేరిన కొన్ని వారాల వ్యవధి లోనే అంబటి రాయుడు రాజీనామా చేశారు. తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నానని.. కొంత కాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నానని ఈరోజు ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించారు. రాయుడు తీసుకున్న నిర్ణయంపై టీడీపీ స్పందించింది. జగన్ లాంటి వ్యక్తితో కలిసి మీరు రాజకీయ ఇన్నింగ్స్ ఆడనందుకు సంతోషంగా ఉందని టీడీపీ ట్వీట్ చేసింది. మీ భవిష్యత్తు ప్రయాణం సజావుగా సాగాలని కోరుకుంటున్నట్టు తెలిపింది.
కొద్దిరోజుల కిందట సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు అంబటి రాయుడు. డిసెంబర్ 28న సీఎం జగన్ సమక్షంలో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీలో చేరారు. సచివాలయంలో అంబటి రాయుడుకి శాలువా కప్పి జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. రాజకీయాలతో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంబిస్తున్నట్లు అప్పుడు చెప్పారు అంబటి రాయుడు. సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. మొదట్నుంచి తనకు సీఎం జగన్‌పై మంచి అభిప్రాయం ఉందని చెప్పాడు. సీఎం జగన్ కులమతాలు, రాజకీయాలతో పనిలేకుండా పారదర్శకంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు.