పశ్చిమ గోదావరి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు బృందానికి ప్రమాదం తప్పింది. టీడీపీ నేతలు ప్రయాణిస్తున్న బోటు ఒక్కసారిగా కుదుపులకు గురవ్వడంతో పడవ బోల్తా పడినట్లు తెలిసింది. సోంపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆచంట నుంచి బోటులో గంట ప్రయాణం చేసిన చంద్రబాబు బృందం సోంపల్లి వద్ద బోటు దిగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పదిహేను అడుగుల లోతు ఉన్న నీటిలో మాజీ మంత్రులు సత్యనారాయణ, దేవినేని ఉమ, నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యేలను వెంటనే మత్స్యకారులు, సెక్యూరిటీ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి రక్షించారు.
టీడీపీ నేతలు రాధాకృష్ణ, అంగర రామోహన్ రావు, రామరాజు తదితరులు ఉన్నారు. బోటు సామర్థ్యానికి మించి ఎక్కడంతోనే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. తక్షణమే స్పందించిన మత్స్యకారులు టీడీపీ నేతలను నదిలో నుంచి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. చంద్రబాబు పర్యటనలో భాగంగా సోంపల్లి చేరుకున్న సందర్భంగా టీడీపీ నేతలు ప్రయాణిస్తున్న రెండు పడవలు పరస్పరం ఢీకొన్నాయి. దీంతో ఓ వైపునకు ఒరిగిపోయిన పడవలో ఉన్న టీడీపీ నేతలు గోదావరిలో పడిపోయారు. మత్స్యకారులు వేగంగా స్పందించడంతో ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదు.