గవర్నర్‌ను కలిసిన టీడీపీ నేతలు.. ఎందుకంటే..
TDP Leaders Meet With Governer. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ని ఎమ్మెల్సీ పదవి నుండి భర్తరఫ్ చేయాలి
By Medi Samrat Published on 7 Jun 2022 6:47 PM ISTవైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ని ఎమ్మెల్సీ పదవి నుండి భర్తరఫ్ చేయాలి అని మంగళవారం టీడీపీ బృందం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు పిర్యాదు చేసింది. మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆద్వర్యంలో మాజీ మంత్రి పీతల సుజాత, ఎంఎస్ రాజు, పిల్లి మాణిక్యాలరావు తదితర నేతలు గవర్నర్ ని కలిశారు. ఈ సందర్భంగా పోలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు మాట్లాడుతూ.. అనంతబాబుని ఎమ్మెల్సీ పదవి నుండి భర్తరఫ్ చేయాలి అని గవర్నర్ ను కోరాము. గిరిజన ప్రాంతంలో అనంతబాబు చేసిన అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి అని కోరామన్నారు. ఫేక్ సర్టిఫికెట్ లు పెట్టుకుని అనంతబాబు అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు.
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుది నేరచరిత్ర, బోగస్ సర్టిఫికేట్లతో పదవులను అనుభవించాడని.. గిరిజనుల హక్కులను కాలరాశాడని అన్నారు. అనంతబాబు లాంటి నేరస్తులకు పదవులను ఇవ్వటం వైఎస్ఆర్ ప్రభుత్వానికి అలవాటు అయిందని విమర్శించారు. గంజాయి, కలప దోచేసిన దొంగ ఆనంతబాబు అని ధ్వజమెత్తారు. జైల్లో ఆనంతబాబు కి రాచమర్యాదలు ఇస్తున్నారని ఆరోపించారు. కస్టడీ పిటిషన్ వేసి ఆనంతబాబు ని పోలీసులు ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థ నిద్రపోతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. అనంతబాబు సమాజంలో ఉండటానికి అనర్హుడని అన్నారు. శాసనమండలి సభ్యునిగా బర్తరఫ్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వెంటనే గవర్నర్ సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు.