గుడివాడలో 'క్యాసినో' రగడ.. టీడీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత

TDP leaders agitated in Gudivada. కృష్ణా జిల్లా గుడివాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కొడాలి కన్వెన్షన్‌ సెంటర్‌ను

By అంజి  Published on  21 Jan 2022 2:02 PM IST
గుడివాడలో క్యాసినో రగడ.. టీడీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత

కృష్ణా జిల్లా గుడివాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కొడాలి కన్వెన్షన్‌ సెంటర్‌ను పరిశీలించేందుకు వెళ్తున్న టీడీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. గుడివాడలోని కొడాలి కన్వెన్షన్‌ సెంటర్‌లో ఇటీవల సంక్రాంతి పండుగ నాడు క్యాసినో నిర్వహించారని టీడీపీ ఆరోపించింది. ఈ అంశంపై టీడీపీ నిజనిర్దారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే కమిటీ సభ్యులు క్యాసినో నిర్వహించిన ప్రదేశాన్ని పరిశీలించేందుకు గుడివాడకు వచ్చారు. కమిటీ సభ్యుల్లో టీడీపీ సీనియర్‌ నాయకులు నక్కా ఆనందబాబు, బొండా ఉమా, వర్ల రామయ్య, ఆలపాటి రాజా తదితరులు ఉన్నారు.

కాగా మొదట టీడీపీ నాయకులు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుండి క్యాసినో నిర్వహించారని చెబుతున్న కొడాలి కన్వెన్షన్‌ సెంటర్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే నాయకులను అక్కడి వెళ్లేందుకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగారు. ఈ క్రమంలోనే టీడీపీ నేత బొండా ఉమా కారును కొందరు ధ్వంసం చేశారు.

Next Story