కర్నూలులో ఆ ఆవేశం చూసి బాధపడ్డాం : టీడీపీ నేత యనమల
TDP Leader Yanamala Ramakrishnudu. కర్నూలులో ఇటీవల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు
By Medi Samrat
కర్నూలులో ఇటీవల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే..! 2024లో జరగబోయేవే తన చివరి అసెంబ్లీ ఎన్నికలని చంద్రబాబు అన్నారు. ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనం అయ్యాయి. పలువురు నాయకులు చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందిస్తూ వస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అధ్యక్షతన పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. కర్నూలులో మీ ఆవేశం చూసి మేం బాధపడ్డామని యనమల అన్నారు. మీరు టెన్షన్ చెందవద్దు.. ప్రశాంతంగా ఉండండి.. మాకు తగిన సలహాలు ఇవ్వండి అంటూ చంద్రబాబును కోరారు. ఎన్నికలు వస్తే టీడీపీని గెలిపించేందుకు ప్రజలంతా సిద్ధమయ్యారని, అభ్యర్థులను ఖరారు చేసే విషయంలో చంద్రబాబు సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఇంతకుముందు మాదిరే ప్రతి మూడు జిల్లాలకు ఓ ఇన్చార్జిని నియమించాలని యనమల సూచించారు.
టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ టీడీపీ నాయకులు రోడ్డెక్కడానికి సిద్ధంగా ఉండాలని.. అందరూ కలిసి పనిచేస్తే టీడీపీకి 160 కంటే ఎక్కువ సీట్లే వస్తాయని అన్నారు. టీడీపీ గెలవడం ఖాయమని... అయితే గెలుస్తామనే ధీమాతో ఉండొద్దని చెప్పారు. ఇవే తన చివరి ఎన్నికలని చంద్రబాబు చెపితే కొందరు పిచ్చి కుక్కల్లా మాట్లాడారని... అవును చివరి ఎన్నికలే... జగన్ దుర్మార్గపు పాలన నుంచి విముక్తి కలిగించడానికి ఇవే చివరి ఎన్నికలని అన్నారు.