కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తెలుగు దేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు. మచిలీపట్నం చింతచెట్టు సెంటర్‌లో మున్సిపల్ అధికారులు ఆక్రమణల తొలగింపు చేపట్టారు. తెదేపా సానుభూతిపరుల దుకాణాలు తొలగిస్తున్నారంటూ బాధితులకు కొల్లు రవీంద్ర మద్దతుగా నిలిచారు. ఘటనాస్థలిలోనే బైఠాయించడంతో తెదేపా కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు.
గత కొద్ది రోజులుగా కొల్లు రవీంద్ర ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో మైనింగ్ మాఫియాకు సీఎం తెరలేపారని కొల్లు రవీంద్ర ఆరోపించారు. పరిశీలనకు వెళ్లిన టీడీపీ బృందాన్ని అరెస్ట్ చేయడం దారుణమన్నారు. జగన్ అవినీతి పాలనకు మైనింగ్ మాఫియా నిదర్శనమని.. బాక్సైట్ తవ్వకాలకు సీఎం సిద్ధమవుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అభయారణ్యంలో రోడ్డు వేసేందుకు అనుమతి ఎవరిచ్చారన్నారు. రౌతులపూడి ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.