రాధాకు ఫోన్‌.. డీజీపీకి లేఖ‌

TDP Leader Chandrbabu Letter To DGP. టీడీపీ నేత వంగవీటి రాధాను టార్గెట్ చేసి హత్య చేయాలని చూస్తున్నార‌న్న వార్త‌ల‌ నేపథ్యంలో

By Medi Samrat  Published on  29 Dec 2021 4:36 AM GMT
రాధాకు ఫోన్‌.. డీజీపీకి లేఖ‌

టీడీపీ నేత వంగవీటి రాధాను టార్గెట్ చేసి హత్య చేయాలని చూస్తున్నార‌న్న వార్త‌ల‌ నేపథ్యంలో విచారణ చేసి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ నేత చంద్ర‌బాబు డీజీపీకి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితి భయనకంగా ఉందని.. బెదిరింపులు, దాడుల పరంపర కొనసాగుతున్నాయని లేఖ‌లో వివ‌రించారు. తాజాగా విజయవాడకు చెందిన టీడీపీ నేత వంగవీటి రాధాను టార్గెట్‌ చేశారు. కొంతమంది తనపై దాడి చేయడానికి తనను వెంబడిస్తూ రెక్కీ నిర్వహించారని రాధ చెప్పారు. పట్టపగలే ఇలాంటి చట్టవ్యతిరేక చర్యలు చూస్తుంటే.. ఆంధ్రప్రదేశ్‌లో జంగిల్‌ రాజ్, గూండా రాజ్‌ పాలన కొనసాగుతున్న వాస్తవాన్ని ఎత్తిచూపుతున్నాయని పేర్కొన్నారు

పారదర్శకంగా విచారణ జరిపి దోషులకు శిక్ష పడేలా చూడటం అత్యవసరం అని లేఖ‌లో కోరారు. గతంలో జరిగిన చట్టవిరుద్ధమైన, హింసాత్మక సంఘటనలపై ఎటువంటి చర్యలు తీసుకోనందుకే ఇటువంటి సంఘటనలు పదే పదే పునరావృతమవుతున్నాయని చంద్ర‌బాబు అన్నారు. వంగవీటి రాధపై దాడి జరిగితే.. ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చ‌రించారు. నేరస్థులపై తీసుకునే కఠినమైన చర్యలు మాత్రమే గూండా రాజ్ నుండి రాష్ట్రంలో ప్రజల ప్రాథమిక హక్కులు రక్షించబడతాయని పేర్కోన్నారు. వంగవీటి రాధపై రెక్కీ వ్యవహారంపై ఒత్తిడులకు తలొగ్గకుండా త్వరితగతిన, పారదర్శకంగా విచారణ జరిపి, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా దోషులకు శిక్ష పడేలా చూడాలని లేఖ‌లో కోరారు. ఇదిలావుంటే.. వంగవీటి రాధాకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. రాధాతో రెక్కీ నిర్వహించడం, తాజా అంశాలపై ప్రస్తావించారు. త్వరలో కలిసి అన్ని విషయాలు మాట్లాడుతానని రాధాతో చంద్రబాబు అన్నారు.


Next Story