టీటీడీ చేతికర్రలు ఇచ్చి పంపడంపై చంద్రబాబు సెటైర్లు
అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
By Medi Samrat Published on 18 Aug 2023 2:50 PM GMTఅంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమలాపురం గడియారం స్తంభం సెంటర్లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు చేతికర్రలు ఇవ్వడంపై సెటైర్లు వేశారు. మనందరి ఆరాధ్య దైవం తిరుమల వెంకటేశ్వరస్వామి. తిరుమలలో పులులు ఉంటే భక్తులకు కర్రలు ఇస్తామంటున్నారు. ఇంటికో కర్ర మాదిరి మళ్లీ పాత రోజులను గుర్తుచేస్తున్నారన్నారు. భక్తులు కర్రలు పట్టుకుని శ్రీవారిని చూడ్డానికి కాదని.. తిరుమలలో పులులను చంపడానికి వెళుతున్నట్టుందన్నారు. చేతిలో కర్ర ఉంటే పులి పారిపోతుందంట.. ఇది సరైన నిర్ణయమేనా.. సమర్థ ప్రభుత్వం అయితే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందా? అని ప్రశ్నించారు. ఇంటికో కర్ర పెట్టుకుని ఈ వైసీపీ దొంగలను తరిమికొట్టాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు.
అటవీ శాఖ అధికారుల ప్రతిపాదన మేరకే నడచి వచ్చే భక్తులకు చేతి కర్రలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి చెప్పారు. భక్తుల భద్రత లో భాగంగా అటవీ శాఖ సూచనల మేరకు అడవి లో 300 సిసి కెమెరాలు ఏర్పాటు చేశామని, మరో 200 కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. భక్తులకు కర్రలు ఇచ్చి టీటీడీ తన భాధ్యత నుంచి తప్పించుకుంటోందని సోషియల్ మీడియాలో విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు.