చంద్రబాబుకు భారీ ఊరట
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట లభించింది.
By Medi Samrat Published on 10 Jan 2024 10:00 AM GMTటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట లభించింది. చంద్రబాబుపై నమోదైన మద్యం అనుమతుల కేసు, ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) కేసు, ఇసుక పాలసీ కేసుల్లో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు ఒకేసారి మూడు కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు జడ్జి జస్టిస్ టి.మల్లికార్జునరావు ఈ మేరకు తీర్పు వెలువరించారు. మద్యం కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీనరేశ్ కు కూడా బెయిల్ మంజూరైంది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చంద్రబాబు తరఫున ప్రముఖ లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు సహేతుకం కాదని చంద్రబాబు తరఫు లాయర్ సిద్ధార్థ్ లూథ్రా కోర్టులో వాదించారు. ఏపీలో మద్యం పాలసీకి సంబంధించి చంద్రబాబు హయాంలో తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సీఐడీ కేసు నమోదు చేసింది. నెల రోజుల క్రితమే ఈ మూడు కేసులపై వాదనలు పూర్తికాగా.. తీర్పును జస్టిస్ సి మల్లికార్జున రావు నేతృత్వంలోని ధర్మాసనం రిజర్వ్ లో పెట్టింది.