టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్..!

టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.

By Medi Samrat  Published on  9 Sept 2023 9:15 AM IST
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్..!

టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాలలో చంద్రబాబు బస చేసిన బస్సు నుంచి కిందికి రావడంతో పోలీసులు ఆయనతో మాట్లాడి అదుపులోకి తీసుకున్నారు. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో బాబును సిట్, సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. స్కిల్ డెవెలప్మెంట్ స్కామ్‌కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకుండా, కోర్టులో కేసు విచారణ జరుగుతున్న సమయంలో తనను ఎలా అరెస్ట్ చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. కేసు పేపర్లు ఇవ్వాలని, ఎఫ్ఐఆర్ కాపీని చూపించాలని కోరారు. అయితే రిమాండ్ రిపోర్ట్ ఇవ్వడం కుదరదని పోలీసులు తెలిపారు.

తనను అరెస్ట్ చేసేందుకు కారణాలు ఏంటో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేసారు. దీంతో అరెస్ట్ కు సంబంధించిన పేపర్లను, వివరాలను అందించారు పోలీసులు. ఆ తర్వాత వైద్య పరీక్షలు చేసి చంద్రబాబును అదుపులోకి తీసుకున్నారు. నంద్యాలలో బస చేసిన చంద్రబాబు బస్సు వద్దకు పెద్ద ఎత్తున పోలీసులు వచ్చారు ఆయనను అదుపులోకి తీసుకుంటున్నట్లు చెప్పారు. తన హక్కులను ఉల్లంఘిస్తున్నారని చంద్రబాబు నాయుడు పోలీసులను ప్రశ్నించారు. ఏ చట్ట ప్రకారం తనను అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రాథమిక ఆధారాలు లేకుండా ఎలా అదుపులోకి తీసుకుంటున్నారని నిలదీశారు. తాము హైకోర్టుకు ప్రాథమిక ఆధారాలు ఇచ్చామని పోలీసులు తెలిపారు.

Next Story