అమరావతి: 'ఆఖరికి ఏపీకి కూడా పెట్టుబడులు వస్తున్నాయి' అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న మండిపడ్డారు. 'నీ వెకిలి మాటల వల్లే తెలంగాణలో మీ పార్టీ ఓడింది. ప్రజలు బుద్ధి చెప్పినా నీ వెకిలి మాటలు పోలేదు. జగన్‌తో జతకట్టిన నువ్వు మాకు నీతులు చెప్పేవాడివా? ఏపీని చిన్న చూపు చూస్తావా? నోరు జాగ్రత్తగా ఉంచుకో.. మా రాష్ట్రానికి చంద్రబాబు అనే బ్రాండ్ ఉంది. ఆయన్ను చూసి కంపెనీలు వస్తాయి' అని పేర్కొన్నారు.
తెలంగాణా ప్రజలు బుద్ది చెప్పినా కేటీఆర్‌కు వెకిలి మాటలు, వెకిలి చేష్టలు పోలేదన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు అరెస్టు సమయంలో ఇలాగే మాట్లాడరని.. అక్కడ కార్యక్రమాలు చేస్తుంటే.. అడ్డుకుని వెకిలిగా కేటీఆర్ మాట్లాడారన్నారు. పక్క రాష్ట్రంలో చేసుకోండి అన్నందుకు.. మీ ప్రభుత్వం కుప్పకూలిపోయిందని బుద్ధా వెంకన్న అన్నారు. తెలంగాణాలో బీఆర్‌ఎస్‌కు దిక్కు లేదు కానీ.. కేటీఆర్ ఏపీ గురించి మాట్లాడుతున్నారు అంటూ విరుచుకుపడ్డారు. ఏపీ గురించి కానీ, చంద్రబాబు గురించి కానీ మాట్లాడేటప్పులు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని సూచించారు.
అంతకుముందు తెలంగాణకు రావాల్సిన రూ.1700 కోట్ల సోలార్ ప్రాజెక్టును ఏపీ దక్కించుకోవడంపై కేటీఆర్ చేసిన ట్వీట్ రాజకీయంగా దుమారం రేపింది. 'మా పాలనలో తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామం. కాంగ్రెస్ పాలనలో పెట్టుబడిదారులు తెలంగాణ కంటే గుజరాత్, తమిళనాడు.. ఆఖరుకు ఏపీని ఎంచుకుంటున్నారు' అని ట్వీట్ చేశారు. ఆఖరు అనే పదం వాడటంతో.. కేటీఆర్‌పై ఏపీ ప్రజలు ఫైర్ అవుతున్నారు.