జనసేన ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీతో జత కట్టిన విషయం తెలిసిందే..! అయితే ఒక్క చోట మాత్రం జనసేన టీడీపీతో ఏకం అయింది. ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల ఫ‌లితాలు విడుదలవ్వగా ఎంపీపీ ప‌ద‌వుల‌ను ద‌క్కించుకునేందుకు ఆయా పార్టీలు ప్ర‌య‌త్నాలు జ‌రుపుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలో టీడీపీ, జనసేనలు ఒక్కటయ్యాయి. టీడీపీకి ఎంపీపీ పదవి ఇచ్చేందుకు జనసేన అంగీక‌రించగా, జనసేనకు ఉప‌ ఎంపీపీ పదవి ఇచ్చేందుకు టీడీపీ ఒప్పుకుంది. ఆచంటలో ఇటీవ‌ల వెల్ల‌డైన ఫ‌లితాల్లో టీడీపీకి చెందిన‌ ఏడుగురు గెలుపొందారు. అలాగే, వైసీపీకి చెందిన‌ ఆరుగురు, జనసేనకు నలుగురు ఎంపీటీసీలు ఉన్నారు. దీంతో ఎంపీపీ పదవిపై ఉత్కంఠ నెల‌కొంది. చివ‌ర‌కు టీడీపీ, జనసేన ఒప్పందం కుదుర్చుకుని ఎంపీపీ, ఉప ఎంపీపీ ప‌ద‌వుల‌ను ద‌క్కించుకున్నాయి.మంత్రి రంగనాధ రాజు సొంత నియోజకవర్గం ఆచంటలో ప్రతిపక్ష పార్టీలు ఆధిక్యత సాధించడంపై ఇప్పుడు టాక్ నడుస్తూ ఉంది.

ఇక ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలపై జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క సీటుతో మొదలైన జనసేన రోజురోజుకీ బలపడుతోందని.. పరిషత్ ఎన్నికల్లో తెగించి పోరాడి 25 శాతం ఓట్లు సాధించామని చెప్పారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు సృష్టించినా పరిషత్ ఎన్నికల్లో బలంగా పోరాడామన్నారు. నామినేషన్ నుంచి కౌంటింగ్ వరకూ వైసీపీ అరాచకాలు చేసిందని.. అధికార యంత్రాంగం చోద్యం చూసిందని పవన్ ధ్వజమెత్తారు. పరిషత్ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన అభ్యర్ధులకు పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు.


సామ్రాట్

Next Story