'ప్రజలు నా శపథాన్ని నిలబెట్టారు'.. రాజధానిపై చంద్రబాబు కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి రాజధానిగా ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖను ఆర్థిక, ఆధునిక నగరంగా తయారు చేసుకుందామన్నారు.
By అంజి Published on 11 Jun 2024 12:05 PM IST'ప్రజలు నా శపథాన్ని నిలబెట్టారు'.. రాజధానిపై చంద్రబాబు కీలక ప్రకటన
టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు విజయవాడ ఏ కన్వెన్షన్‌లో భేటీ అయ్యారు. చంద్రబాబును శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. చంద్రబాబును సీఎం అభ్యర్థిగా పవన్ కల్యాణ్ ప్రతిపాదించగా.. మూడు పార్టీల ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ ఏకగ్రీవ తీర్మానాన్ని కూటమి నేతలు గవర్నర్‌కు పంపనున్నారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానం పలకనున్నారు. రేపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
కూటమి సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్డీయే సభా పక్షనేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పుని ప్రజలు ఇచ్చారన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. నూటికి నూరు శాతం మూడు పార్టీల నేతల, కార్యకర్తలు సమిష్టిగా పని చేశారన్నారు. మూడు పార్టీల నేతలు, కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానని చంద్రబాబు అన్నారు. పవన్ కల్యాణ్ సమయ స్ఫూర్తిని ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. తాను జైలులో ఉన్నప్పుడు పవన్ వచ్చి పరామర్శించారని, టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటున్నట్లు చెప్పారని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటుందని, ఎలాంటి పొరపచ్చాలు లేకుండా కలిసి పని చేశామని చంద్రబాబు తెలిపారు.
తప్పు చేసిన వారిని వదిలిపెట్టబోనని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. తప్పు చేసిన వాడిని క్షమించి, పూర్తిగా వదిలిపెడితే అలవాటుగా మారుతుందని అన్నారు. తప్పు చేసిన వాళ్లకు చట్టపరంగా శిక్ష పడాల్సిన అవసరం ఉందన్నారు. అదే సమయంలో విధ్వంస, కక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలన్నారు. పదవి వచ్చిందని విర్రవీగొద్దని, వినయంగా ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని చంద్రబాబు తెలిపారు. ప్రజల రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందన్నారు. కేంద్రం సహాయం అవసరమని బీజేపీ నాయకత్వాన్ని కోరామని, పూర్తిగా సహకరిస్తామని వారు హామీ ఇచ్చారని చంద్రబాబు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి రాజధానిగా ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖను ఆర్థిక, ఆధునిక నగరంగా తయారు చేసుకుందామన్నారు. ఆనాటి సీఎం విశాఖను రాజధానిగా చేస్తానంటే నువ్వు రావొద్దని ప్రజాతీర్పు ఇచ్చిన నగరం విశాఖ అని చంద్రబాబు పేర్కొన్నారు. కర్నూలును న్యాయరాజధానిగా చేస్తామని చివరికి ఏమీ చేయలేదన్నారు. తన శపథాన్ని రాష్ట్ర ప్రజలు గౌరవించి అధికారం ఇచ్చారని చంద్రబాబు తెలిపారు. నిండు సభలో తన కుటుంబానికి అవమానం జరిగిందన్నారు. అది గౌరవ సభ కాదని.. కౌరవ సభ అని చెప్పి బయటకు వచ్చానన్నారు. ప్రజా క్షేత్రంలో గెలిచి గౌరవ సభగా చేసి అడుగుపెడుతానని చెప్పానని, ప్రజలు తన మాట నిలబెట్టారని అన్నారు. వారందరి సహకారంతో రేపు సీఎం ప్రమాణ స్వీకారం చేస్తున్నానని స్పష్టం చేశారు.