కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ నేత వరుపుల రాజా గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. 47 సంవత్సరాల వయసున్న రాజా గత రాత్రి 9 గంటలకు గుండెపోటుకు గురయ్యారు. ఆయనను వెంటనే కాకినాడలోని సూర్య గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి స్థానిక అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 11 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. ఐదేళ్ల క్రితం కూడా రాజా గుండెపోటుకు గురయ్యారు. అప్పట్లో వైద్యులు స్టంట్ వేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు.
గుండెపోటుతో మరణించిన వరుపుల రాజా భౌతికకాయానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబు రోడ్డు మార్గంలో కాకినాడ జిల్లా ప్రత్తిపాడుకు చేరుకున్నారు. రాజా భౌతికకాయానికి నివాళులర్పించి , కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వ వేధింపులతోనే వరుపుల రాజా మరణించారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అక్రమ కేసులతో వరుపుల రాజాను వేధించారని, 12 కేసులతో ఆయనను టెన్షన్ పెట్టారని.. దీనికి తోడు కరోనా కూడా రావడంతో రాజా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అన్ని విధాలుగా అండగా వుంటుందని రాజా కుటుంబానికి చంద్రబాబు హామీ ఇచ్చారు.