విషాదం.. గుండెపోటుతో టీడీపీ నేత వ‌రుపుల రాజా మృతి

టీడీపీ నేత వరుపుల రాజా గుండెపోటుతో క‌న్నుమూశారు.ఆయ‌న వ‌య‌స్సు 47 సంవ‌త్స‌రాలు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 March 2023 3:05 AM GMT
Varupula Raja, TDP

వరుపుల రాజా

తెలుగు దేశం(టీడీపీ) పార్టీలో విషాదం చోటు చేసుకుంది. ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లా డీసీసీబీ మాజీ ఛైర్మ‌న్‌, ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ఇన్‌చార్జ్ వరుపుల రాజా గుండెపోటుతో క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌స్సు 47 సంవ‌త్స‌రాలు.

ఉత్త‌రాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బొబ్బిలి, సాలూరు నియోజ‌క‌వ‌ర్గాల పార్టీ ఇన్‌చార్జీగా వ్య‌వ‌హ‌రిస్తున్న రాజా కొద్ది రోజులుగా ప్ర‌చారంలో పాల్గొని శ‌నివారం సాయంత్రం స్వ‌గ్రామం ప్ర‌త్తిపాడుకు వ‌చ్చారు. పార్టీ శ్రేణులు, బంధువుల‌తో కాసేపు మాట్లాడారు. రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలో గుండెపోటు రావ‌డంతో వెంట‌నే ఆయ‌న్ను కుటుంబ స‌భ్యులు కాకినాడ‌లోని అపోలో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

చికిత్స పొందుతూ ప‌రిస్థితి విష‌మించ‌డంతో రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో తుదిశ్వాస విడిచారు. నేడు(ఆదివారం) మ‌ధ్యాహ్నం త‌రువాత పెద్ద శంక‌ర్ల‌పూడిలో ఆయ‌న అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు. వరుపుల రాజాకు గ‌తంలో రెండు సార్లు గుండెపోటుకు రావ‌డంతో స్టంట్లు వేశారు.

వరుపుల రాజా మృతితో టీడీపీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయ‌న మృతి ప‌ట్ల టీడీపీ అధినేత చంద్ర‌బాబు తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. రాజా మృతి టీడీపీకి తీరని లోటన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియ‌జేశారు.

Next Story