తెలుగుదేశం పార్టీకి గత కొద్ది రోజులుగా దూరంగా ఉంటూ వచ్చిన.. పార్టీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు హైదరాబాద్ లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను కలిశారు. గత ఎన్నికల తర్వాత గంటా శ్రీనివాసరావుకు, టీడీపీకి మధ్య దూరం పెరిగిందని ప్రచారం జరుగుతోంది. పార్టీ కార్యక్రమాల్లో గంటా పెద్దగా పాల్గొన్నది లేదు. ఈ నేపథ్యంలో లోకేశ్ తో గంటా భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. జూబ్లీహిల్స్ లోని లోకేశ్ నివాసానికి వచ్చిన గంటా దాదాపు 40 నిమిషాల సేపు చర్చించారు. పార్టీ పట్ల తన వైఖరిని ఆయన లోకేశ్ కు వివరించినట్టు తెలుస్తోంది.
ఇక నారా లోకేశ్ ను ఆయన నివాసంలో నందమూరి తారకరత్న కలిశారు. కుటుంబపరమైన అంశాలతో పాటు రాజకీయ పరిణామాలపై ఇరువురు చర్చించారు. తారకరత్న గతంలో టీడీపీ తరఫున ప్రచారం చేశారు. ఇక ఆయన వచ్చే ఎన్నికల్లో ఏపీ అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నారు. లోకేశ్ తో సమావేశంలోనూ తారకరత్న పోటీ చేసే నియోజకవర్గం అంశం ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది.