సినిమా టిక్కెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా సమస్యలు ఉన్నాయని.. టిక్కెట్ రేట్ల విషయం చాలా చిన్నదని అన్నారు. ఇంతకు ముందు పన్నులు చెల్లించకుండా అధిక ధరలకు టిక్కెట్లు విక్రయించేవారని.. ఇప్పుడు సహేతుకంగా ధరలు పెంచితే పన్నులు చెల్లించేందుకు ముందుకు వచ్చారని అన్నారు. భారీ బడ్జెట్ సినిమాల టిక్కెట్ రేట్లు పెంచాలని కోరడం సరికాదని తమ్మారెడ్డి అన్నారు. అయితే.. మొత్తం పరిశ్రమ గురించి ప్రభుత్వంతో మాట్లాడాలని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్‌లను కోరారు.
తెలుగు సినీ పరిశ్రమ సమస్యలను త్వరగా పరిష్కరించాలని తమ్మారెడ్డి భరద్వాజ సీఎం జగన్‌ను కోరారు. ఈసారి చిరంజీవితో పాటు ఛాంబర్ సభ్యులను పిలిస్తే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న నంది అవార్డుల కార్యక్రమాన్ని కూడా తమ్మారెడ్డి భరద్వాజ గుర్తు చేసి పరిష్కరించాలని కోరారు. కాగా, సినిమా టిక్కెట్ ధరలపై చర్చించేందుకు చిరంజీవి నేతృత్వంలోని బృందం గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలవనుంది. టిక్కెట్ ధరలపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన కమిటీ.. తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించి ధరల పెంపునకు సిఫారసు చేసినట్లు సమాచారం. ఈ భేటీ తర్వాత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.