ఎవ‌రు ఏపీ సీఎం కానున్నారో చెప్పేసిన హీరో విశాల్‌..!

తమిళ నటుడు విశాల్ ఓ సంచలన విషయాన్ని వెల్లడించాడు. రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యానని స్పష్టం చేశాడు

By Medi Samrat  Published on  17 April 2024 2:13 PM IST
ఎవ‌రు ఏపీ సీఎం కానున్నారో చెప్పేసిన హీరో విశాల్‌..!

తమిళ నటుడు విశాల్ ఓ సంచలన విషయాన్ని వెల్లడించాడు. రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యానని స్పష్టం చేశాడు. హరి దర్శకత్వం వహించిన రత్నం సినిమా ఇంటర్వ్యూలో తన రాజకీయ ప్రవేశంపై మాట్లాడాడు. తాను రాజకీయాల్లోకి రావడం ఖాయమన్నారు. అయితే పార్టీ ప్రకటన గురించి కానీ మరే పార్టీలో చేరడం గురించి ఇంకా చెప్పలేదు. తమిళనాడు స్టార్ హీరో విజయ్ అధికారికంగా తన పార్టీ TVKని ప్రకటించారు. ప్రస్తుత చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, హెచ్.వినోత్‌తో మరో సినిమా చేసిన తర్వాత తాను పూర్తిగా రాజకీయాలపై దృష్టి సారిస్తానని విజయ్ కూడా ధృవీకరించారు. ఇప్పుడు విశాల్ కూడా పాలిటిక్స్ లో రావడానికి సిద్ధమయ్యాడు.

మరో వైపు ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విశాల్ స్పందించారు. ఆంధ్రాలో మళ్లీ వైఎస్ జగన్ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ పై జరిగిన దాడిపై స్పందిస్తూ.. రాజకీయాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయని, జాగ్రత్తగా ఉండాలని అన్నారు. తాను వైసీపీ పార్టీకి ఎప్పుడూ మద్దతు ప్రకటించలేదని, జగన్ అంటే తనకు ప్రత్యేక అభిమానం మాత్రం ఉందని విశాల్ అన్నారు. ముఖ్యంగా జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు సీఎం జగన్ ఎదిగిన తీరు అందరినీ ఆకట్టుకుంటోందని అన్నారు.

Next Story