ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు

Supreme Court verdict in favor of AP Govt. ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీం కోర్టు మరో తీర్పును ఇచ్చింది.

By Medi Samrat
Published on : 17 May 2023 7:30 PM IST

ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు

ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీం కోర్టు మరో తీర్పును ఇచ్చింది. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపులకు సుప్రీం కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఆర్‌5 జోన్‌లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొచ్చని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే హక్కు ప్రభుత్వానికి ఉందని బుధవారం తీర్పు వెలువరించింది. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ కె ఎం. జోసెఫ్ , జస్టిస్ అరవింద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే హక్కు ప్రభుత్వానికి ఉందని బెంచ్‌ తీర్పు సందర్భంగా పేర్కొంది. చట్టం ప్రకారమే ఐదు శాతం ఈడబ్ల్యూఎస్‌కు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అయితే కేసు తుది ఉత్తర్వులకు లోబడే ఇళ్ల పట్టాలపై హక్కులుంటాయని ధర్మాసనం స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. 34వేల ఎకరాలలో 900 ఎకరాలు మాత్రమే పేదలకు కేటాయించారని.. కొందరు రైతులు మాత్రమే ఇక్కడికి వచ్చారన్నారు. సిఆర్డిఎ చట్టం లోని సెక్షన్.53.1డి ప్రకారం పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అధికారం ప్రభుత్వానికి ఉందని వాదించారు.


Next Story