ప్రభుత్వం కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ నిరుద్యోగ, యువజన, విద్యార్థి సంఘాలు నేడు 'చలో తాడేపల్లి'కి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేఫథ్యంలో తెలుగు యువత, టీఎన్‍ఎస్‍ఎఫ్ ఆధ్వర్యంలో నిరుద్యోగ, యువజన, విద్యార్థి సంఘాలు పోలీసుల వలయాన్ని చేదించుకుని.. సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడికి యత్నించాయి. జాతీయ రహదారిపై నుండి ఒక్కసారిగా కిందకు దిగడంతో విద్యార్థి సంఘాలను.. సీఎం నివాసానికి వెళ్లే ప్రధాన మార్గం వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో విద్యార్థి సంఘాలకు, పోలీసులు మధ్య తోపులాట జరిగింది. విద్యార్థి సంఘాల నేతలు.. సీఎం.. డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ నేఫథ్యంలో పోలీసులు టీడీపీ, వామపక్ష, కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘాల నేతలు పలువురిని అరెస్టు చేశారు. పోలీసుల తీరుపై విద్యార్థి సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. ఇదిలావుంటే.. చలో తాడేపల్లి కార్యక్రమానికి అనుమతి లేదని గుంటూరు అర్బన్ ఎస్పీ జులై 17న ప్రకటన విడుదల చేశారు. ఈ నేఫథ్యంలోనే పోలీసులు ముందస్తుగానే కట్టడి చర్యలకు దిగారు.